Begin typing your search above and press return to search.

మ‌రింత హ‌ర్ట్ చేస్తున్నారే కేసీఆర్‌..?

By:  Tupaki Desk   |   1 July 2018 4:55 AM GMT
మ‌రింత హ‌ర్ట్ చేస్తున్నారే కేసీఆర్‌..?
X
త‌ప్పులు అంద‌రూ చేస్తారు. కానీ.. చేసిన త‌ప్పును సరైన స‌మ‌యంలో దిద్దుకోవ‌టం చాలా అవ‌స‌రం. ఏమైందో ఏమో కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నారు. మిగిలిన రాజ‌కీయ అధినేత‌ల‌కు.. కేసీఆర్‌ కు ఉన్న వ్య‌త్యాసం ఏమిటంటే.. త‌న త‌ప్పుల్ని ఆయ‌న వెంట‌నే గుర్తిస్తారు. ఎదుటివారు వేలెత్తి చూపించేస‌రికి.. ఆయ‌న దిద్దుబాటులోకి వెళ‌తారు. ఎందుకో కానీ.. కౌలురైతులు అంటేనే ఆయ‌న ఎగిరెగిరి ప‌డుతున్నారు.

ఎన్నిక‌ల వేళ‌.. అంద‌రి మ‌న‌సుల్ని దోచుకోవాల‌న్న ఉద్దేశంతో ఉన్న ఆయ‌న‌.. బ‌డ్జెట్ లెక్క‌ల్ని ప‌క్క‌న పెట్టి తెలంగాణ రాష్ట్రంలోని రైతుల‌కు రైతు బంధు ప‌థ‌కం పేరుతో భారీ ప‌థ‌కానికి తెర తీశారు. చ‌రిత్ర‌లో ఇలాంటి ప‌థ‌కం లేద‌ని ఆయ‌న చెప్పినా.. గ‌తంలో వాజ్ పేయ్ ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది. కాకుంటే.. దాన్ని కేసీఆర్ మాదిరి ప్ర‌చారం చేసుకోలేదంతే.

ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. రాష్ట్రంలో రైతుల కంటే కౌలురైతులు ఎక్కువ‌న్న‌ది నిజం. మ‌రో క‌ఠిన వాస్త‌వం ఏమిటంటే.. ఇప్పుడు నేరుగా వ్య‌వ‌సాయం చేసే రైతులు త‌క్కువ‌. చాలామంది కౌలు రైతుల‌కు భూములు అప్ప‌జెప్పి ఇత‌ర ప‌నుల్లో మునిగిపోతున్నారు. వ్య‌వసాయం చేసే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంట‌ప్పుడు వ్యవ‌సాయం చేసే కౌలురైతుల గురించి ఆలోచించాల్సిన ప్ర‌భుత్వం.. భూయ‌జ‌మానులైన వారి విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అదే స‌మ‌యంలో కౌలు రైతుల విష‌యంలో క‌ఠినంగా.. వారి మ‌న‌సులు గాయ‌ప‌రిచేలా సీఎం కేసీఆర్ ప‌దే ప‌దే మాట్లాడుతున్నారు.

ప్రాక్టిక‌ల్ గా చూస్తే.. రైతుల‌కు సాయం చేసినంత ఈజీ కాదు కౌలు రైతుల‌కు సాయం చేయ‌టం. ఆ విష‌యాన్ని కేసీఆర్ నేరుగా చెప్ప‌లేక‌పోవ‌చ్చు. కానీ.. అలా చెప్ప‌కుండా ఉండ‌టానికి.. కౌలు రైతులు నొచ్చుకునేలా వ్యాఖ్య‌లు చేయ‌టం స‌బ‌బు కాదు. వీలైనంత‌మందికి త‌న ప‌థ‌కాల ద్వారా ల‌బ్థిదారుల్ని చేసుకొని.. ఓటుబ్యాంకును అంత‌కంత‌కూ పెంచుకోవాల‌న్న వైఖ‌రిని కేసీఆర్ త‌ర‌చూ ప్ర‌ద‌ర్శిస్తుంటారు.

ఏమైందో ఏమో కానీ.. కౌలురైతుల విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం కేసీఆర్ నోటి మాట పెళుసుగా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.కౌలు రైతుల విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతున్నా.. ఆయ‌న మాత్రం త‌న మాట‌ల తీరును మార్చుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం. కౌలురైతుల‌కు సాయం అందించే అవ‌కాశం లేదంటూ మాట్లాడిన మ‌రుస‌టి రోజు.. ఇదే విష‌యం మీద మ‌రింత ఘాటుగా రియాక్ట్ కావ‌టం గ‌మ‌నార్హం.

రైతుల‌కు పంట పెట్టుబ‌డి ఇవ్వ‌టం కోస‌మే రైతుబంధు ప‌థ‌కం అమ‌లు చేస్తున్నాం కానీ కౌలు రైతుల కోసం ఎంత మాత్రం కాద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేస్తున్నారు. ఇది రైతుబంధు ప‌థ‌క‌మే త‌ప్పించి కౌలు రైతుబంధు ప‌థ‌కం ఎంత మాత్రం కాద‌న్న మాట‌ను తేల్చేసి చెప్ప‌టం గ‌మ‌నార్హం. కౌలురైతుల‌కు సంబంధించి కేసీఆర్ వ్యాఖ్య‌లు ఇక్క‌డితో ఆగినా ఫ‌ర్లేదు కానీ.. ఆయ‌న మ‌రో అడుగు ముందుకేసి.. "ఏ హ‌క్కు లేని వారికి.. భూమికి సంబందించి ఎలాంటి ప‌త్రం లేని వారికి డ‌బ్బులు ఇవ్వాల‌ని కొంద‌రు వాదిస్తున్నారు. ఇది న్యాయ‌స‌మ్మ‌తం కాదు. ఏ హ‌క్కు లేనివారికి ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి డ‌బ్బులు చెల్లించ‌టం త‌ప్పు. ఒక‌వేళ ప్ర‌భుత్వం అలాంటి త‌ప్పు చేస్తే ప్ర‌శ్నించాల్సింది పోయి.. ప్ర‌భుత‌త్వ‌మే త‌ప్పు చేయాల‌ని వాదించ‌టం ఏమిటి? " అంటూ ఆయ‌న ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఇదంతా విన్న త‌ర్వాత కేసీఆర్‌ కు ఏమైంద‌న్న క్వ‌శ్చ‌న్ రాక మాన‌దు. ఆయ‌న చెప్పిన లాజిక్ ప్ర‌కార‌మే చూస్తే.. ముఖ్య‌మంత్రికి అధికార నివాసం ఇప్ప‌టికే ఉంది. కానీ.. కేసీఆర్ సీఎం అయ్యాక తన‌కు కేటాయించిన గృహం న‌చ్చ‌లేదు. అంతే.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ పేరుతో వంద‌ల కోట్ల ఖ‌ర్చుతో భారీ నిర్మాణాన్ని నిర్మించారు. ఇలాంటి ఖ‌ర్చు విష‌యంలో కేసీఆర్ కు ఉన్న‌ హ‌క్కు గురించి ప‌క్క‌న పెడితే..అధికారికంగా ఒక నివాసం (అది కూడా కొత్త‌దే అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు) ఉన్న వేళ‌.. దానికి బ‌దులుగా ప్ర‌జాధ‌నంతో భారీ నిర్మాణాన్ని ప్ర‌శ్నించినా ప్ర‌యోజ‌నం లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. త‌న వ‌ర‌కూ ఒక నీతి.. ప్ర‌జ‌ల‌కు మ‌రో నీతి ఏంది కేసీఆర్ జీ?