Begin typing your search above and press return to search.

స్మార్ట్ సిటీలో.. దోమ‌ల మోత‌!

By:  Tupaki Desk   |   1 July 2021 11:30 AM GMT
స్మార్ట్ సిటీలో.. దోమ‌ల మోత‌!
X
దోమ‌లు బాధిస్తున్నాయి అని చెబితే.. విన‌డానికి సిల్లీ స‌మ‌స్య‌గా అనిపిస్తుంది. దాదాపు అంద‌రూ న‌వ్వుతారు కూడా. కానీ.. అవే దోమ‌లు సృష్టించే దారుణాల‌ను లెక్కేసుకుంటే మాత్రం గుండెలు గుభేల్ మ‌న‌డం ఖాయం. మ‌లేరియా సోకితే.. క‌నీసం నెల రోజులు మంచానికి ప‌రిమితం కావాల్సిందే. డెంగ్యూ వంటి జ్వ‌రాలు ప్ర‌బ‌లితే.. ప్రాణాలు సైతం పోగొట్టుకోవాల్సి వ‌స్తుంది. ఇక‌, ఆసుప‌త్రుల బిల్లుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి కూడా రావొచ్చు.

ఈ ప‌రిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తి సంవ‌త్స‌ర‌మూ ఉండేదే. ఇవాళ క‌రోనా వ‌చ్చింది కాబ‌ట్టి.. అంద‌రూ జ్వ‌రాల సంగ‌తే మ‌రిచిపోయారు గానీ.. కొవిడ్ గోల లేకుంటే సీజ‌న్ వ్యాధుల చ‌ర్చ ఓ రేంజ్ లో ఉండేది. అస‌లే వానా కాలం మొద‌లైనందున‌.. సీజ‌న‌ల్ వ్యాధులు కోర‌లు చాస్తుంటాయి. ఈ ప‌రిస్థితి నుంచి గ‌ట్టెక్కేందుకు ప‌రిశుభ్ర‌తే ప్ర‌ధాన ఆయుధం.

అయితే.. ఇంటి ప‌రిస‌రాల‌నైతే జ‌నం శుభ్రంగా ఉంచుకుంటారు. అది వారి బాధ్య‌త‌. మ‌రి రోడ్లు, మురుగు కాల్వ‌లు, ఇత‌ర ఖాళీ స్థ‌లాల బాధ్య‌త ఎవ‌రిది? ఖ‌చ్చింతంగా యంత్రాంగానిదే. గ్రామం అయితే పంచాయితీ.. ప‌ట్ట‌ణం అయితే మునిసిపాలిటీ, న‌గ‌ర పాల‌క సంస్థ‌లు ఈ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించాలి. సీజ‌నల్ వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా.. బ్లీచింగ్ చ‌ల్లించ‌డం, మొద‌లు ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త త‌ర‌లింపు, నీరు నిల్వ లేకుండా చేయ‌డం వంటివి చేయాలి.

కానీ.. కాకినాడ మునిసిప‌ల్ అధికారులు ఈ విష‌యాన్నే మ‌రిచిపోయిన‌ట్టున్నారు. క‌నీస పారిశుధ్య‌ చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో రాత్రి, ప‌గ‌లు అనే తేడాలేకుండా దోమ‌లు దాడిచేస్తున్నాయ‌ని జ‌నం ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దోమ‌ల నివార‌ణ‌కు ప్ర‌తీ సంవ‌త్స‌రం కాకినాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఏకంగా రూ.50 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ప్ప‌టికీ.. ప‌రిస్థితిలో మాత్రం మార్పు రావ‌ట్లేద‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అక్క‌డే కాకుండా.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెలకొంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.