Begin typing your search above and press return to search.

కేసీఆరా మజాకానా? వరుస వార్నింగ్ లు ఇచ్చేశారుగా

By:  Tupaki Desk   |   20 April 2020 4:00 AM GMT
కేసీఆరా మజాకానా? వరుస వార్నింగ్ లు ఇచ్చేశారుగా
X
ఎప్పుడు ఏ విషయాన్ని ఎలా చెప్పాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికి తెలీదనే చెప్పాలి. కరోనా నేపథ్యంలో ప్రజా జీవితం పై తమ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల గురించి ప్రస్తావించే క్రమంలో.. లాక్ డౌన్ ను ఉల్లంఘించి రోడ్ల మీదకు వచ్చే వారిని కాల్చేస్తామన్న తెగింపు మాట ఆయన నోటి నుంచి మాత్రమే రాగలదు. నిజానికి కాల్చేస్తామని చెప్పటంతో ఉద్దేశం.. ప్రజల్ని కాల్చేయటం కాదు. అంతటి తీవ్ర నిర్ణయాన్ని తీసుకునే దారుణ పరిస్థితి కరోనా కారణంగా నెలకొంటోందన్నది ఆయన భావన.
ఈ కారణంతోనే ఆయన మాటలు సంచలనంగా మారాయే తప్పించి.. వివాదం కాలేదు. లాక్ డౌన్ 2.0లో కొన్ని సడలింపులు చేస్తూ కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున చర్చించిన కేసీఆర్.. తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి సడలింపులు లేవని తేల్చేశారు. అంతేకాదు.. గత ప్రెస్ మీట్ లకు భిన్నంగా పలు రంగాల వారికి వరుస పెట్టి ప్రభుత్వ ఆదేశాల రూపంలో వార్నింగ్ ఇచ్చేందుకు వెనుకాడలేదు.

లాక్ డౌన్ వేళ నెలకొన్న చిత్రమైన పరిస్థితులకు తగ్గట్లే.. సీఎం కేసీఆర్ తాజా హెచ్చరికలు ఉన్నాయని చెప్పక తప్పదు. కష్టమైనా.. కటువైన మాటల్ని మాట్లాడాల్సిన అవసరం.. పదునైన నిర్ణయాల్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దీనికి తగ్గట్లే.. కేసీఆర్ తాజా ఆదేశాలు వార్నింగ్ రూపంలో ఉన్నాయని చెప్పక తప్పదు. ఇందులో అన్నింటికంటే కీలకమైనది.. అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పటం. బతకటమే కష్టంగా ఉన్న వేళ.. అద్దెలు చెల్లించాలని యజమానులు ఒత్తిడి చేయకూడదని.. అలా చేసిన పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నోటి మాటగా చెబుతున్నది కాదని.. ఇదే విషయాన్ని ప్రభుత్వ ఆదేశం రూపంలోనూ జారీ చేసిన విషయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

స్కూల్ ఫీజుల విషయంలోనూ కీలక నిర్ణయాన్ని కేసీఆర్ సర్కారు తీసుకుంది. రానున్న విద్యా సంవత్సరానికి స్కూళ్ల యజామాన్యాలు కేవలం స్కూలు ఫీజు మాత్రమే వసూలు చేయాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ ఫీజును రూపాయి కూడా పెంచకూడదని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఇప్పటివరకూ అమలవుతున్నట్లుగా టర్మ్ ఫీజులు వసూలు చేయకుండా.. ఏ నెలకు ఆ నెల మాత్రమే వసూలు చేయాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. ఆ విషయాన్ని విద్యా సంస్థలు గుర్తించాలని.. ఫీజులు రూపాయి కూడా పెంచకుండా ఉండటంతో పాటు.. ట్యూషన్ ఫీజు మినహా మరెలాంటి ఫీజులు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు.

అలా కాకుండా ఉంటే.. వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పాలి. ఒక విధంగా ఈ నిర్ణయం వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు ఉపశమనంగా మారే అవకాశం ఉంది. దీంతో పాటు.. మే 7 వరకు ఎలాంటి వేడుకులకు అనుమతి ఇవ్వమని చెప్పాలి. ఇళ్లల్లోని వారు సైతం పెళ్లిళ్లు.. ఫంక్షన్లు.. ఇలా వేటిని చేసుకోకూడదని తేల్చి చెప్పారు. ఏవైనా సరే.. మే ఏడు తర్వాత పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాలి. అప్పటి వరకూ ఖాళీగా ఉండే.. కల్యాణ మండపాల్ని ఎరువుల గోదాములుగా నెల రోజుల పాటు వాడుకుంటామని చెప్పారు. ఇలా.. పలు ప్రభుత్వ నిర్ణయాల్ని సూటిగా.. స్పష్టంగా చెప్పటమే కాదు.. తమ నిర్ణయాల్ని ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.