Begin typing your search above and press return to search.

పుష్కరాల దెబ్బకు ప్రొటెక్షన్ పాయె..

By:  Tupaki Desk   |   23 Aug 2016 7:19 AM GMT
పుష్కరాల దెబ్బకు ప్రొటెక్షన్ పాయె..
X
కృష్ణా పుష్కరాల కారణంగా పోలీసు శాఖకు కంటి మీద కునుకు కూడా ఉండడం లేదు. పుష్కర ఏర్పాట్లు - భద్రత పనుల్లో ఉన్న పోలీసులు తమ ఇతర విధులను నిర్వర్తించలేకపోతున్నారు. ఎంతగా అంటే కేంద్ర మంత్రులకు సైతం భద్రత కల్పించలేని పరిస్థితిలో ఉన్నారట. తాజాగా ఘటన దాన్ని రుజువు చేస్తోంది. సోమవారం కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ వస్తున్నట్లుగా ఏపీ పోలీసులకు ముందే సమాచారం అందింది... అయితే... పుష్కర విధుల కారణంగా వారు సకాలంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు ఎస్కార్ట్ వాహనాన్ని పంపించలేదు. దీంతో కేంద్ర మంత్రి తన సొంత గన్‌ మెన్‌ లు - వ్యక్తిగత కార్యదర్శులతో నగరానికి చేరుకున్నారు.

సోమవారం సాయంత్రం హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో బిజెపి నేతలు 70 ఏళ్ల స్వాతంత్య్రంపై పలు రంగాల ప్రముఖులకు సత్కార కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా పాల్గొనాల్సి వుంది. ఇక వెంకయ్యనాయుడు హైదరాబాద్ నుంచి విమానంలో సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం చేరుకున్నారు. అయితే ఎస్కార్ట్ రాకపోవటంతో గన్నవరంలోని స్వర్ణ భారతి ట్రస్ట్ నుంచి వచ్చిన రెండు కార్లలో బయలుదేరి నేరుగా సభాస్థలికి చేరుకున్నారు. ఆలస్యంగా తేరుకున్న ఎస్కార్ట్ పోలీస్‌ లు వాయువేగంతో అక్కడికి చేరుకున్నప్పుడు వెంకయ్యనాయుడు వారి పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి చెందారు.

మరోవైపు ఆ సభకే వచ్చిన ఏపీ స్పీకర్ కోడెల వెంట కూడా సరైన సెక్యూరిటీ లేదు. గన్ మేన్లు మినహా ప్రత్యేకంగా భద్రతేమీ లేదు. దీనిపై స్పీకర్ ఏమీ స్పందించనప్పటికీ వెంకయ్య మాత్రం పోలీసుల తీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తంచేశారు. నిజానికి ఉగ్రవాద చర్యలు - మావోయిస్టులు ఉనికి చాటుకోవడం కోసం కాచుక్కూచోవడం వంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి స్థాయి నేతలకే భద్రత కల్పించకపోవడం చిన్న విషయం కాదు. అయితే... పుష్కరాల బాధ్యత నెత్తిన ఉండడంతో పోలీసు శాఖ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందన్న వాదన వినిపిస్తోంది.