Begin typing your search above and press return to search.

రాహుల్ తలపై లైట్.. సెల్ ఫోన్ తో అలా సాధ్యమా?

By:  Tupaki Desk   |   12 April 2019 4:54 AM GMT
రాహుల్ తలపై లైట్.. సెల్ ఫోన్ తో అలా సాధ్యమా?
X
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తలపై లైట్ పడిన ఉదంతం తీవ్ర కలకలాన్ని రేపింది. పార్టీ వర్గాలు విపరీతమైన ఆందోళనకు గురి చేసిన ఈ వైనంపై కేంద్ర భద్రతా విభాగం సింఫుల్ గా తేల్చేస్తున్నా.. సీరియస్ గా తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

అమేధీలో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు రాహుల్ కుడివైపు తలపై ఆకుపచ్చని రంగులో రెండుసార్లు ఒక లైట్ పడటం కలకలానికి కారణం. కొద్ది సెకన్ల తేడాతో రాహుల్ ఒంటిపై మొత్తం ఏడు చోట్ల ఈ కాంతి పడటం గమనార్హం. ఈ వ్యవహారం కలకలాన్ని రేపింది. రాహుల్ మీద హత్యాయత్నంలో భాగంగానే ఈ లైట్ పడిందని.. తుపాకీ లైట్ గా కొందరు అభిప్రాయపడ్డారు.

ఈ వ్యవహారాన్ని భద్రతా వర్గాల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన వారు రాహుల్ మీద పడిన వెలుగును సింఫుల్ గా తీసేశారు. హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. రాహుల్ ఒంటి మీద వెలుగు పడుతున్న వైనం తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పుంగులను తాము చూసినట్లు పేర్కొన్నారు.

ఏఐసీసీ ఫోటోగ్రాఫర్ ఒకరు విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు సెల్ ఫోన్ తో షూట్ చేశారని.. ఆ సందర్భంగా ఆ కెమేరా నుంచి వచ్చిన లైట్ రాహుల్ తలపై పడినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇవాల్టి రోజున అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. షూట్ చేసేటప్పుడు ఒంటి మీద వెలుగు పడుతుందా? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. సెల్ ఫోన్ తో షూట్ చేస్తుంటే.. ఒంటి మీద ఏడు చోట్ల వెలుగు ఎలా పడుతుంది? ఫోటోను ఒంట్లోని వివిధ భాగాల మీద తీస్తున్నారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఏమైనా.. రాహుల్ భద్రతకు సంబంధించి మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.