Begin typing your search above and press return to search.

ఉప్పు కిలో 200 అంటే కేంద్రం దిగొచ్చింది

By:  Tupaki Desk   |   12 Nov 2016 4:43 AM GMT
ఉప్పు కిలో 200 అంటే కేంద్రం దిగొచ్చింది
X
కేంద్ర ప్రభుత్వం మరోమారు నిత్యావసర సరుకుల ధ‌ర‌ల పెరుగుద‌ల ఒత్తిడిలో పడింది. కిలో ఉప్పు ధర రూ.200 అయింది. దేశంలో ఉప్పు కొరత ఏర్పడిందని ఉత్తరప్రదేశ్‌ లో వదంతులు వ్యాపించాయి. దీంతో ప్రజలు దుకాణాలకు ఎగబడ్డారు. ఇదే అదునుగా వ్యాపారులు ధరలు పెంచేయడంతో ఓ దశలో కిలో ప్యాకెట్ ధర రూ.200కు చేరింది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.

రాష్ట్రంలో ఉప్పు కొరత లేదని, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరింది. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల పోలీసు అధికారులతో మాట్లాడారు. ఈ వార్తలను వ్యాపింపజేస్తున్న వారిని గుర్తించాలని, ఉప్పును అధిక ధరలకు అమ్మే వ్యాపారులు - ఉప్పును అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ఆహారశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సైతం ఈ ప‌రిణామంపై స్పందించారు. ఢిల్లీలో మాట్లాడుతూ - వదంతులు నమ్మవద్దని - దేశంలో సరిపడా ఉప్పు నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఘటన తమ దృష్టికి వచ్చిందని, కిలో రూ.200కు అమ్మిన వ్యాపారులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడ వదంతులు వ్యాపించినా వెంటనే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.