Begin typing your search above and press return to search.

3 నెలలుగా.. 132 గ్రామాల్లో ఒక్క ఆడ‌పిల్ల పుట్ట‌లేద‌ట‌!

By:  Tupaki Desk   |   22 July 2019 5:04 AM GMT
3 నెలలుగా.. 132 గ్రామాల్లో ఒక్క ఆడ‌పిల్ల పుట్ట‌లేద‌ట‌!
X
షాకింగ్ నిజం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీని వెనుకున్న అస‌లు కార‌ణం ఏమిట‌న్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికీ.. విన్నంత‌నే ఉలిక్కిప‌డేలాంటి ఉదంతంగా దీన‌ని చెప్పాలి. ఉత్త‌రాఖండ్ రాష్ట్రం లోని 132 గ్రామాల్లో గ‌డిచిన మూడు నెల‌లుగా ఒక్క‌రంటే ఒక్క ఆడ‌పిల్ల పుట్ట‌ని వైనం తాజాగా వెల్ల‌డైంది.

గ‌డిచిన‌ మూడు నెలల్లో 132 గ్రామాల్లో 216 మంది పిల్ల‌లు పుట్ట‌గా.. వారంతా మ‌గ‌పిల్ల‌లు కావ‌టం గ‌మ‌నార్హం. అందులో ఒక్క‌రు కూడా ఆడ‌పిల్ల లేక‌పోవ‌టం వెనుక కార‌ణం ఏమిట‌న్న‌ది ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మూడు నెల‌లుగా అన్నేసి గ్రామాల్లో ఒక్క ఆడపిల్ల ఎందుకు పుట్ట‌లేద‌న్న విష‌యంపై తాము స‌ర్వే చేయిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆశిష్ చౌహాస్ చెబుతున్నారు.

ఒక్క ఆడ‌పిల్ల పుట్ట‌క‌పోవ‌టాన్ని తాము సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం వెలుగు చూసినంత‌నే.. ఈ విష‌యానికి అత్య‌ధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ ఆషా కార్య‌క‌ర్త‌ల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఇదిలా ఉంటే.. దీనికి కార‌ణం భ్రూణ హ‌త్య‌లేన‌ని సామాజిక కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు.

గ‌ర్భం దాల్చిన వెంట‌నే.. అన‌ధికారికంగా పుట్టేది అమ్మాయా? అబ్బాయా? అన్న విష‌యాన్ని తెలుసుకుంటున్న త‌ల్లిదండ్రులు ఆడ‌పిల్ల అయితే భ్రూణ‌హ‌త్య‌లు చేయిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. సామాజిక చైత‌న్యం లోపించ‌టం.. గ్రామీణుల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌టంలో అధికారులు విఫ‌లం కావ‌టం కూడా ఈ దారుణ ప‌రిస్థితికి కార‌ణంగా చెబుతున్నారు.