Begin typing your search above and press return to search.

మైదుకూరు-తాడిప‌త్రిల‌లో ఏం జ‌రిగింది ?

By:  Tupaki Desk   |   15 March 2021 4:30 AM GMT
మైదుకూరు-తాడిప‌త్రిల‌లో ఏం జ‌రిగింది ?
X
రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీ ఫ్యాన్ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున ప్ర‌భంజ‌నం చాటింది. అన్ని కార్పొరేష‌న్లు, దాదాపు అన్ని మునిసిపాలిటీల‌ను కూడా కైవ‌సం చేసుకుంది. అయితే.. ఇంత చేసినా.. రెండు కీల‌క మునిసిపాలిటీల్లో మాత్రం వైసీపీ ప‌ట్టు సాధిం చ‌లేకపోయింది. వీటిలో ఒక‌టి అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి, జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోని మైదుకూరు మునిసిపాలిటీల్లో టీడీపీ మెజారిటీ సాధించింది. తాడిప‌త్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ కు సానుభూతి ప‌వ‌నాలు బాగానే వీచాయి. దీంతో ఇక్క‌డ ఆయ‌న వ‌ర్గం మెజారిటీ సాధించింది.

తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 36 ఉన్నాయి. టీడీపీ 18 వార్డులలో విజయం సాధించిం ది. వైసీపీ 16 స్థానాలలో గెలుపొందింది. సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందారు. దీనికి ప్ర‌ధానంగా ప‌నిచేసిన కార‌ణాలేంటి ? అన్న‌దే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని మునిసిపాలిటీల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకున్నా.. కీల‌క‌మైన తాడిప‌త్రిలో ఓట‌మి మాత్రం ఆపార్టీకి జీర్ణించుకోలేని స‌మ‌స్య‌. త‌మ కీల‌క ప్ర‌త్య‌ర్థి.. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. మ‌రింత‌గా వైసీపీకి ఇబ్బందిగా మారింది. అయితే.. ఇక్క‌డ వైసీపీకి వ్య‌తిరేక‌త క‌న్నా.. కూడా.. జేసీ వ‌ర్గానికి సానుకూల ప‌వ‌నాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఆయ‌న‌ను ప‌దే ప‌దే అరెస్టు చేయ‌డం, వివిధ కేసుల‌తో జైల్లో పెట్ట‌డం.. జైల్లోనే క‌రోనాకు గురి కావ‌డం.. పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంలోనూ కేసులు న‌మోదు చేయ‌డం వంటివి ప్ర‌జ‌ల్లో సానుభూతిని పెంచాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్ర‌భాక‌ర్ ఇంటికి వెళ్లి మ‌రీ ఆయ‌న్ను తిట్టిరావ‌డం కూడా స్థానికంగా ప్ర‌జ‌లు వ్య‌తిరేకించారు. ఇదే ఓట్ల రూపంలో కూడా క‌న‌ప‌డింది. పైగా ఎమ్మెల్యేగా చేసిన జేసీ ప్ర‌భాకర్ స్వ‌యంగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌డం కూడా వాళ్లుక ప్ల‌స్ అయ్యింది.

ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ హోరా హోరీ పోరు సాగినా.. జేసీ వ‌ర్గం ఒకింత మెజారిటీ ద‌క్కించుకుని వైసీపీకి షాకిచ్చింద‌ని అంటున్నారు. ఇక‌, మ‌రో కీల‌క మునిసిపాలిటీ.. ఏకంగా క‌డ‌ప‌లోని మైదుకూరు. ఇక్క‌డ అస‌లు టీడీపీకి బ‌లం లేద‌ని, గెలుపు ఏక‌ప‌క్ష‌మేన‌ని వైసీపీ నాయ‌కులు అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఇక్క‌డ టీడీపీ మెజారిటీ సాధించింది. ఇక్క‌డ టీటీడీ మాజీ చైర్మ‌న్‌.. టీడీపీ కీల‌క నాయ‌కుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోయారు. తాను వ‌రుస ప‌రాజ‌యాలు పొందుతున్న నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇక్క‌డ స‌త్తాచాటాల‌నే ప‌ట్టుద‌ల‌తో పుట్టా ముందుకు సాగిన‌ట్టు తెలుస్తోంది.

ఇదే ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ప్ర‌తిబింబించింద‌ని చెబుతున్నారు. దీనికితోడు.. వైసీపీ నేత‌ల మితిమీరిన అంచ‌నాలు.. గెలుపుపై అతి ప్ర‌చారం వంటివి ఆ పార్టీకి ఇబ్బందిగా మార‌య‌నేది ఒక అంచ‌నా.. మొత్తంగా చూస్తే.. మైదుకూరులో టీడీపీ ఆశ‌లు ఫ‌లించాయ‌నే చెప్పాలి. అందునా.. జ‌గ‌న్ సొంత జిల్లాలో ఇలాంటి ప‌రిణామం ఎదురు కావ‌డం గ‌మ‌నార్హం.