Begin typing your search above and press return to search.

టీడీపీ 'ఐసీయూ'లో ఉందా?

By:  Tupaki Desk   |   1 Aug 2019 2:30 PM GMT
టీడీపీ ఐసీయూలో ఉందా?
X
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఐసీయూలో ఉందని.. విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవలి అసెంబ్లీ సెషన్స్ సందర్భంగా కొందరు తెలుగుదేశం నేతలే ఈ వ్యాఖ్యను చేసినట్టుగా తెలుస్తోంది. తమ పార్టీ పట్ల ఆ విశ్లేషణలో వ్యంగ్యం కాకుండా, వాస్తవిక అంశాల ప్రస్తావన ఉండటం గమనార్హం.

ముందుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనారోగ్యం కారణాలను చూపి అసెంబ్లీ సమావేశాలను సైతం పక్కన పెట్టి అమెరికా వెళ్లారు. చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే వయసు మీద పడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన పార్టీని ఇంకెంత కాలం నడిపించగలరు? అనే ప్రశ్న ఉండనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన అనారోగ్యం అంటూ చికిత్స కోసం విదేశానికి వెళ్లడం టీడీపీ గ్రాఫ్ ను మరింతగా దెబ్బతీస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అనారోగ్యంతో చికిత్స కోసం అమెరికా వరకూ వెళ్లారంటే నిజంగానే ఆయనకు వయసు మీద పడిందనే భావన ప్రజల్లో కూడా కలుగుతూ ఉంది.

ఇక చంద్రబాబు తన వారసుడిని టీడీపీకి పెద్ద దిక్కుగా తయారు చేయాలని ఐదేళ్ల నుంచి రకరకాల ప్రయత్నాలు చేశారు. వాటికి దక్కిన ఫలితం ఎంతో కూడా అందరికీ తెలిసిందే. లోకేష్ ఇప్పటికూ ఓపెన్ డయాస్ మీదకు రాలేకపోతున్నారు. ట్విట్టర్లో కూర్చుని రాజకీయం చేయడమే ఆయనకు వస్తోంది తప్ప, అంతకు మించి సత్తా చూపించలేకపోతూ ఉన్నారు.

ఇక పార్టీని ముందుండి నడిపించడానికి ఎవరికీ చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చేలా లేరు. వాళ్లు లోకేష్ ను తొక్కేస్తారేమో అనే భయం చంద్రబాబుకే ఉంది. ఇలా తనయుడిపై ప్రేమతో తెలుగుదేశం పార్టీలో మరో లీడర్ షిప్ ను ఎదగనీయకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.

మరోవైపు బాలకృష్ణ పేరుకు అయితే ఉన్నారు. ఎన్టీఆర్ తనయుడిగా ఇప్పుడు పార్టీ బాధ్యతలను బాలయ్య భుజాన వేసుకోవచ్చు. అయితే ఇంకా బాలకృష్ణ సినిమాల మీదే పడ్డారు. ఇంకా ఎన్నేళ్లు అవే సినిమాలు చేస్తారు? ఎలాగూ ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి, బాలకృష్ణ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను కూడా తీసుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ వారసులకు రాజకీయాల పట్ల అంత సీరియస్ నెస్ కనపడదు.

చంద్రబాబు ఏమో ఆఖరికి అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి వైద్య చికిత్స కోసం వెళ్లారు. ఈ పరిణామాలను విశ్లేషిస్తూ టీడీపీ ఐసీఎయూలో ఉందని అనడానికి వెనుకాడనక్కర్లేదని పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం.