Begin typing your search above and press return to search.

భారత పార్లమెంట్ లో రచ్చ రేపిన ట్రంప్ ఆఫీస్!

By:  Tupaki Desk   |   23 July 2019 8:29 AM GMT
భారత పార్లమెంట్ లో రచ్చ రేపిన ట్రంప్ ఆఫీస్!
X
కశ్మీర్ అంశంలో భారత్ - పాకిస్తాన్ ల మధ్యన మధ్యవర్తిత్వానికి రెడీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్టుగా వచ్చిన వార్తలపై పార్లమెంట్ లో రచ్చ రేగింది. మధ్యవర్తిత్వం వహించమంటూ భారత ప్రధాని మోడీ తనను కోరారంటూ ట్రంప్ పాకిస్తాని సుప్రిమో ఇమ్రాన్ ఖాన్ తో వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ట్రంప్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది.

మరోవైపు ట్రంప్ ను మధ్యవర్తిత్వం వహించమంటూ తాము కోరలేదని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మోడీ నుంచి అలాంటి విన్నపం ఏదీ వెళ్లలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడి ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటనపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి.

ఈ విషయంలో మోడీ సర్కారును ఇరకాటంలో పెడుతోంది ప్రతిపక్షం. ఈ మేరకు రాజ్యసభలో రచ్చ రేగింది. ఇండియాలో అధికారంలో ఎవరు ఉన్నా.. కశ్మీర్ అంశాన్ని భారత అంతర్గత వ్యవహారం అనే అంటారు. గతంలో యూపీఏ సర్కారు కూడా వేరే దేశాల మధ్యవర్తిత్వానికి ఒప్పుకోలేదు.

కశ్మీర్ విషయంలో ఇండియా - పాక్ ల మధ్యన మధ్యవర్తిత్వానికి రెడీ అంటూ కొంతమంది అప్పుడు కూడా ప్రకటనలు చేశారు. అయితే వారిని అప్పటి ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో మధ్యవర్తిత్వం నెరపమంటూ మోడీనే తనను కోరాడంటూ ట్రంప్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది.

ఈ అంశంలో ట్రంప్ పొగరుబోతులా ఏదో వాగేశాడో ఏమో కానీ.. ఆ ప్రకటన అయితే మోడీని ఇరకాటంలో పెడుతూ ఉంది. ప్రస్తుతానికి అయితే మోడీ అలాంటి విన్నపం ఏమీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తద్వారా ప్రతిపక్షాన్ని చల్లార్చేపనిలో ఉంది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర మంత్రి జై శంకర్ ఒక ప్రకటన కూడా చేశారు.