Begin typing your search above and press return to search.

కిడ్నీది ఏ కులం?

By:  Tupaki Desk   |   23 Jan 2016 10:30 PM GMT
కిడ్నీది ఏ కులం?
X
కులం - మతం మనుషులను మౌఢ్యంలోకి నెట్టేస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. లౌకిక రాజ్యంగా ఉన్న భారత్ ఇప్పుడు క్రమంగా కుల గజ్జి - మత పిచ్చితో పరువు తీసుకుంటున్నారు. చివరకు మూత్రపిండాలు అమ్ముకుని బతకాలన్నా కూడా కులం అడుగుతున్నారని ఓ విద్యార్థి ఆవేదన చెందుతుండడం దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. నిరుపేద దళిత విద్యార్థి ఒకరు ఏ దారీ లేక బతుకు కోసం, చదువు కోసం కిడ్నీని అమ్ముకుందామనుకున్నాడు. అయితే... అందుకు అతనికి కులమే అడ్డంకిగా మారిందని చెబుతున్నాడు. చదువుకోవడానికి కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితే ఎంతో బాధాకరమైతే.... అందుకు కులం అడ్డంకిగా మారడం మరింత ఆవేదనాభరితం. భువనేశ్వర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న మహేశ్ వాల్మీకి అనే దళిత విద్యార్థి పడుతున్న కష్టాలు... ఆయన తన కిడ్నీ అమ్ముకుందామన్నా కూడా నీదే కులం అని అడగడం వంటివన్నీ ఇప్పుడు దేశం ఎటుపోతుందన్న ప్రశ్నను మరోసారి వేసుకునేలా చేస్తున్నాయి.

రాజస్థాన్ లోని ఆల్వార్ లో ఓ దళిత కుటుంబంలో పుట్టిన మహేశ్‌ వాల్మీకి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభావంతుడే. అనారోగ్యం బాధిస్తున్నా, పేదరికం పీడిస్తున్నా కూడా క్లీనర్‌గా పనిచేస్తూనే ఆయన తన చదువు కొనసాగించాడు. ప్రతిభావంతుడు కావడంతో ఐఐటీలో సీటు సాధించి మైనింగ్ ఇంజినీరింగ్ లో చేరాడు. పదో తరగతిలో 85 శాతం, ఇంటర్మీడియేట్‌లో 70 శాతం మార్కులు సాధించిన మహేశ్ ఐఐటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో మంచి ఫలితాలు రావడంతో భువనేశ్వర్‌లో అడ్మిషన్ పొందాడు. 2.7 లక్షలు అప్పుచేసి చదువు కొనసాగిస్తున్నాడు. అయితే... అప్పు తీర్చమని ఒత్తిడి పెరగడంతో తీర్చే దారిలేక కిడ్నీ అమ్ముకోవాలనుకున్నాడు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ లో ప్రయత్నించినా ముందుగా నీ కులమేంటని అడిగేవారే కనిపించారు. చివరికి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుందామని ప్రయత్నించినా, ముందుగా తన కులం గురించి వారు వాకబు చేసేవారని మహేశ్ చెబుతున్నాడు.

దీంతో మహేశ్ అప్పులు తీరే దారిలేక.. ఐఐటీలో చదువు ఆపేసి రాజస్థాన్‌లోని తన స్వస్థలం అల్వార్‌ వెళ్లిపోయాడు. అక్కడ నెలకు 4 వేల జీతానికి స్వీపర్ గా పనిచేస్తున్నాడు. అయితే.... రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సందీప్ పాండేను కలవగా ఆయన ఐఐటీ భువనేశ్వర్ పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించి ఇచ్చారని, ఆ సొమ్ముతో తన అప్పులు తీర్చేశానని మహేశ్ చెప్పాడు. కాగా ఆయన తండ్రి పక్షవాతంతో బాధపడుతున్నారు.. తల్లి స్వీపర్‌గా పనిచేస్తోంది. కాగా ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో మహేశ్ ఉదంతం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఐఐటీ విద్యార్థి తన చదువు కోసం కిడ్నీని అమ్ముకునే పరిస్థితి రావడమే దారుణమంటే.... కిడ్నీ కొనేవాళ్లు కులం అడగడం మరింత దారుణమని అంటున్నారు.