Begin typing your search above and press return to search.

నితీశ్‌ ని మోదీ అవ‌మానించారా?

By:  Tupaki Desk   |   3 Sep 2017 12:11 PM GMT
నితీశ్‌ ని మోదీ అవ‌మానించారా?
X
బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌రాభ‌వించారా? ఉద్దేశ పూర్వ‌కంగానే ఆయ‌న‌ను అవ‌మానించారా? చేసుకున్న వాళ్ల‌కు చేసుకున్నంత అన్న‌ట్టుగా ప్ర‌జ‌లిచ్చిన తీర్పును కాద‌ని, బీజేపీతో జ‌ట్టుక‌ట్టి ప్ర‌భుత్వాన్ని ఏర్ప‌రిచినందుకు నితీశ్ కు గ‌ట్టి ఎదురు దెబ్బే త‌గిలిందా? అంటే ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. మోదీ సంగ‌తి తెలియ‌క నితీశ్ ఆయ‌న‌తో పెట్టుకున్నాడ‌ని, ఇప్పుడు స‌రిగ్గా బుద్ది వ‌చ్చింద‌ని చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. కేంద్రంలో కొలువుదీరి మూడేళ్ల‌యిన నేప‌థ్యంలో మోదీ ముచ్చ‌ట‌గా మూడోసారి కేంద్ర మంత్రి వ‌ర్గాన్ని పున‌ర్వ్య‌స్థీక‌రించారు. అయితే, దీనిలో త‌మ‌కు స్థానం ద‌క్కుతుంద‌ని నితీశ్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.

కానీ, అనూహ్యంగా నితీశ్‌ కి మోదీ హ్యాండిచ్చారు. జేడీయూకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండానే ఆయ‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించారు. ఇక‌, దీనిపై నితీశ్‌ కు అన్ని వైపుల నుంచి దాడి పెరిగిపోయింది. ఎన్నిక‌ల్లో బీహార్ ప్ర‌జ‌లిచ్చిన తీర్పును నితీశ్ కాల‌రాశార‌ని, అర్ధంత‌రంగా ఆర్‌ జేడీ - కాంగ్రెస్ మ‌హాఘ‌ట‌బంధ‌న్‌ ను తెంచేసి బీజేపీతో చేరిపోయి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి మోదీని న‌మ్ముకున్నార‌ని, అందుకే జ‌ర‌గాల్సింది జ‌రిగింద‌ని ఆర్జేడీ అధినేత లాలూ నితీశ్‌ పై నిప్పులు చెరిగారు. ‘కావాల్సిన వాళ్లను వదులుకుని ఆయన వారి వెంటపడ్డారు. కనీసం ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించలేదు. అది నితీశ్‌ తలరాత’ అంటూ లాలూ పేర్కొన్నారు.

ఇక‌, నితీశ్‌ ను ప్ర‌ధాని మోదీ పిల‌వ‌క‌పోవ‌డానికి మ‌రో కార‌ణం కూడా వినిపిస్తోంది. కేంద్రంలో నితీశ్ పార్టీ జేడీయూకి ప్ర‌ధాని మోదీ రెండు బెర్తులు ఇచ్చేందుకు రెడీ అయ్యార‌ని, అయితే, నితీశ్‌ మూడు పదవులను డిమాండ్ చేశారని కొంద‌రు పేర్కొంటున్నారు. అయితే,మోదీ .. నితీశ్ మాట‌ల‌ను బుట్ట‌దాఖ‌లు చేశార‌ని, ఈ నేప‌థ్యంలోనే నితీశ్ అలకబూనారని చెబుతున్నారు. ఏదేమైనా తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో నితీశ్‌ కు ఇటు రాష్ట్రంలోనూ బ‌య‌ట కూడా తీవ్ర విమ‌ర్శ‌లు, అవ‌మానాలూ ఎదుర్కోక త‌ప్ప‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి మోదీ ఏమంటారో చూడాలి.