Begin typing your search above and press return to search.

మీ వార్షిక జీతం రూ.10ల‌క్ష‌లా? మీకు ప‌న్ను పోటు లేన‌ట్లే!

By:  Tupaki Desk   |   4 Feb 2019 8:16 AM GMT
మీ వార్షిక జీతం రూ.10ల‌క్ష‌లా?  మీకు ప‌న్ను పోటు లేన‌ట్లే!
X
చిన్న చిన్న అంశాలే కానీ దృష్టి పెట్ట‌ని కార‌ణంగా చాలా క‌న్ఫ్యూజ‌న్స్ వ‌స్తుంటాయి. తాజా బ‌డ్జెట్ లో మోడీ స‌ర్కారు ప్ర‌వేశ పెట్టిన ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపు లెక్క కూడా ఇలాంటిదే. టీవీ స్క్రోల్స్ లోనూ.. త‌ర్వాతి రోజు పేప‌ర్ల‌లోనూ రూ.5ల‌క్ష‌ల ఆదాయం ఉన్నోళ్ల‌కు ఎలాంటి ప‌న్ను ఉండ‌ద‌న్న‌ట్లుగా కొన్నిప‌త్రిక‌లు రాశాయి. కానీ.. లోతుల్లోకి వెళితే ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి. వాడుక భాష‌లో చెప్పాల్సి వ‌స్తే.. మీకు నెల.. నెల వ‌చ్చే జీతం ఏడాదికి రూ.10ల‌క్ష‌లు అనుకుందాం. మీకు ప‌న్ను ప‌డుతుందా? అంటే.. లేద‌నే చెప్పాలి. పోనీ.. మీ ఏడాదికి వ‌చ్చే జీతం రూ. 10,25,00అనుకోండి. మీకు ప‌న్నుపోటు ఉంటుందా? అంటే.. ఉండ‌దంతే. ఎలా అంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

వివ‌రాలు చెప్పే ముందు మీరు కొన్ని ప‌దాల్ని బాగా అర్థం చేసుకోవాలి. నిక‌ర ఆదాయం.. స్థూల ఆదాయం. నిక‌ర ఆదాయం అంటే.. మీకు వ‌చ్చే మొత్తం ఆదాయంలో ప‌న్ను మిన‌హాయింపులు పోను మిగిలే ఆదాయమ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మ‌రింత వివ‌రంగా చెప్పాలంటే.. ఏడాదికి మీ జీతం రూపాయి అనుకోండి. దాన్ని స్థూల ఆదాయంగా చెప్పాలి. ఆ రూపాయిలో ప‌న్ను మిన‌హాయింపుల కింద యాబై పైసలు తీసివేస్తే.. మిగిలింది యాభై పైస‌లు. అది మీ నిక‌ర ఆదాయ‌మ‌న్న మాట‌. ఇప్పుడు స్థూల‌.. నిక‌ర మీద క్లారిటీ వ‌చ్చేసిందిగా.
ఇప్పుడు లెక్క‌ల్లోకి వెళితే.. మీకు ఏడాది మొత్తానికి వ‌చ్చే జీతం రూ.10,25,000 అనుకుందాం. ఇందులో స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ రూ.50వేలు తీసి వేయాలి. గ‌తంలో ఇది రూ.40వేలుఉండేది. దీన్ని మ‌రో ప‌దివేలు పెంచారు. త‌ర్వాత మెడిక్లెయిమ్ రూ.25వేల వ‌ర‌కూ మిన‌హాయింపు వ‌స్తుంది.

ఇది కాకుండా 80సిసి కింద మీరు చేసే పొదుపు రూ.1.50ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఇది కాకుండా ఎడ్యుకేష‌న్ లోన్ మీద వ‌డ్డీ రూ.ల‌క్ష వ‌ర‌కూ మిన‌హాయింపు ఉంది. దీంతో పాటు గృహ‌రుణం మీద వడ్డీ రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కూ మిన‌హాయింపు ఉంది. ఈ మిన‌హాయింపులు మొత్తం క‌లిపితే రూ.5.25ల‌క్ష‌లు అవుతాయి.అంటే.. మొత్తంగా మీ ఆదాయం రూ.10.25ల‌క్ష‌లు అయితే.. మీకు ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన మిన‌హాయింపులు రూ.5.25ల‌క్ష‌లు. పోను మీ నిక‌ర ఆదాయం రూ.5ల‌క్ష‌లు. ప్ర‌భుత్వం ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కూ ఎలాంటి ప‌న్ను లేద‌ని చెప్పింది కాబ‌ట్టి.. మీరు రూపాయి కూడా ప‌న్ను క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌వేళ మీ వార్షిక ఆదాయం రూ.10.50 అనుకోండి.. మీరు ప‌న్ను ఖాతాలోకి వ‌చ్చేస్తారు. ఇక‌పోతే ఇదంతా ఉద్యోగుల‌కు మాత్ర‌మే కాదు. ఉద్యోగుల‌తో పాటు వ్యాపార‌స్తుల‌కు కూడా. అయితే.. ఉద్యోగుల‌కు స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ రూ.50వేలు ఉంటుంది క‌దా.. వ్యాపార‌స్తుల‌కు ఆ మొత్తం ఉండ‌దు. అంటే.. వ్యాపార‌స్తులు ఎవ‌రైనా స‌రే త‌మ వార్షిక ఆదాయం మొత్తం రూ.9.75 ల‌క్ష‌ల వ‌ర‌కూ అయితేఎలాంటి ప‌న్ను ఉండ‌ద‌ని చెప్పాలి.