Begin typing your search above and press return to search.

రామసుబ్బారెడ్డికి బాబు మళ్లీ మొండిచేయి?

By:  Tupaki Desk   |   12 Jun 2017 7:56 AM GMT
రామసుబ్బారెడ్డికి బాబు మళ్లీ మొండిచేయి?
X
కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డికి ఆ పార్టీ అధినేత ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. జమ్మలముడుగు నుంచి వైసీపీ తరఫున గెలిచిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చిన తరువాత తీవ్ర కినుక వహించిన రామసుబ్బారెడ్డికి గవర్నరు కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ... తాజా పరిణామాలు చూస్తుంటే అది ఉత్తమాటగానే మిగిలిపోయేలా ఉంది. ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు వార్తలు వస్తుండడంతో రామసుబ్బారెడ్డికి నిరాశ తప్పదని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు పార్టీనే నమ్ముకుని ఉన్న తనకంటే ఫిరాయింపు నేత ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు ప్రయారిటీ ఇస్తుండడం... ఆదినారాయణరెడ్డిని ఏమాత్రం కంట్రోల్ చేయకపోవడంతో రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన పార్టీ ముఖ్య కార్యక్రమం మహానాడుకు కూడా రామసుబ్బారెడ్డి కానీ, ఆయన అనుచరులు కానీ హాజరుకాలేదు.

అంతేకాకుండా రామసుబ్బారెడ్డి పార్టీ మారుతారని నిఘా వర్గాలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చాయని కూడా అంటున్నారు. దీంతో చంద్రబాబు ఆయనపై ఆగ్రహించి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గ‌వ‌ర్న‌ర్‌ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉండగా ఒకటి పరకాలకు... మిగతా రెండు కూడా ఇతరులకు ఇస్తారని తెలుస్తోంది. ఆ లిస్టులో రామసుబ్బారెడ్డి పేరు లేదని టీడీపీ వర్గాల సమాచారం. రెండు,మూడు రోజుల్లోనే వీటిపై ఉత్త‌ర్వులు వెలువ‌డే అవ‌కాశం ఉండడంతో దీనిపై టీడీపీలో మరోసారి రచ్చ మొదలయ్యేలా ఉంది. ఈ సంగతి తెలుసుకున్న రామసుబ్బారెడ్డి వర్గం కూడా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు చెప్తున్నారు.. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని రామసుబ్బారెడ్డి బహిరంగంగానే అంటున్నారని.. ఆయన పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/