Begin typing your search above and press return to search.

రైల్వేజోన్ తొక్కి పెట్టిన కేంద్రం.. సాక్ష్య‌మిదే!

By:  Tupaki Desk   |   16 March 2018 5:41 AM GMT
రైల్వేజోన్ తొక్కి పెట్టిన కేంద్రం.. సాక్ష్య‌మిదే!
X
త‌మ‌పై గంపెడు ఆశ‌లు పెట్టుకున్న ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల్సింది పోయి.. వారిని త‌ర‌చూ వేద‌న‌కు గురి చేయ‌టం మోడీ స‌ర్కారుకే చెల్లుతుందేమో? విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని తాము స‌రి చేస్తామ‌ని.. విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల విష‌యంలో తాము అండ‌గా నిలుస్తామంటూ చెప్పిన బీజేపీ నేత‌ల మాట‌లు నీటి మూట‌లేన‌న్న విష‌యం ఇటీవ‌ల కాలంలో రుజువు అవుతోంది.

విశాఖ‌కు రైల్వేజోన్ ఇవ్వ‌టం మోడీ స‌ర్కారుకు సుతారం ఇష్టం లేదు. దీనిపై ఏపీ ఎంపీలు ఎంత పోరాటం చేస్తున్నా.. క‌ల్ల‌బొల్లి మాట‌లు చెబుతున్నారే కానీ.. అస‌లు విష‌యాన్ని మాత్రం చెప్ప‌టం లేదు. ఈ మ‌ధ్య‌న ఢిల్లీలోని అధికారులు రైల్వేజోన్ వ‌ల్ల ఎలాంటి ఉద్యోగాలు రావ‌ని.. దాని వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. ఎందుకు దాని గురించి అన్నిసార్లు అడుగుతారంటూ తింగ‌ర‌గా మాట్లాడ‌టం చూస్తేనే.. రైల్వేజోన్ ఇచ్చే విష‌యంలో మోడీ స‌ర్కార్ మైండ్ సెట్ ఎలా ఉందో ఇట్టే అర్థ‌మైపోతుంది.

ఏపీకి రైల్వే జోన్ కేటాయిస్తే.. కొత్త ఇబ్బందులు తెరపైకి వ‌స్తాయ‌ని.. జోన్ ఇవ్వ‌టం ఒడిశాకు అస్స‌లు ఇష్టం లేదంటూ కేంద్రం చెబుతున్న మాట‌ల‌న్నీ ఉత్త తొండాట అన్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏపీకి రైల్వేజోన్ ఇస్తే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఒడిశా నేత‌లు రైల్వే మంత్రి వ‌ద్ద స్ప‌ష్టం చేసిన‌ట్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం రైల్వే మంత్రిని ఒడిశా ఎంపీల బృందం భేటీ అయ్యింది. ఈస్ట్ జోన్ రైల్వే జోన్ కింద కొత్త డివిజ‌న్లు ఏర్పాటు చేసే విష‌యంపై కేంద్ర‌మంత్రిని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా విశాఖ‌కురైల్వేజోన్ అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని.. జోన్ ఏర్పాటు చేస్తే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేశామ‌ని ఒడిశా నేత‌లు చెబుతున్నారు. ఈ అంశాన్నే ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే.. జోన్ విష‌యంలో మోడీ స‌ర్కార్ తొండాట ఆడుతుంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైన‌ట్లే.

ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రైల్వే మంత్రి పీయూష్ గోయాల్ ను క‌లిసి రైల్వే జోన్ డిమాండ్ ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. అదే స‌మ‌యంలో ఇదే డిమాండ్ మీద క‌లిసేందుకు టీడీపీ ఎంపీల బృందం ప్ర‌య‌త్నిస్తే.. ఆయ‌న అపాయింట్ మెంట్ ఇవ్వ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు బ‌లంగా వినిపించాయి. ఈ నేప‌థ్యంలో విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన పీయూశ్‌.. త‌న అపాయింట్ మెంట్ ను టీడీపీ నేత‌లు కోర‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఏపీకి రైల్వే జోన్ డిమాండ్ పై ప‌లు ప్ర‌శ్న‌లు వేయ‌గా.. వాటికి స‌మాధానం చెప్ప‌కుండా రైల్వే మంత్రి విలేక‌రుల స‌మావేశం మ‌ధ్య‌లో వెళ్లిపోవ‌టం గ‌మ‌నార్హం. జోన్ అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని.. నిబంధ‌న‌ల మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఎప్పిలోపు నిర్ణ‌యం తీసుకుంటారో చెప్పాల‌న్న డిమాండ్‌ కు మాత్రం ఆయ‌న స‌మాధానం చెప్ప‌కపోవ‌టం గ‌మ‌నార్హం. జోన్ ఏర్పాటు విష‌యంపై విభ‌జ‌న చ‌ట్టంలో స్ప‌ష్ట‌త లేద‌ని చెప్పుకొచ్చారు. ఒక‌వేళ‌.. యూపీఏ స‌ర్కారు త‌ప్పు చేసి ఉంటే.. దాన్ని స‌రి చేసి ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేయాలి కానీ.. చ‌ట్టంలో త‌ప్పు ఉంద‌న్న సాకుతో త‌ప్పించుకోవ‌టం ఏమిటి పీయూశ్?