Begin typing your search above and press return to search.

‘బుట్ట’లో జగన్ ఈసారి పడలేదు

By:  Tupaki Desk   |   17 March 2019 10:15 AM GMT
‘బుట్ట’లో జగన్ ఈసారి పడలేదు
X
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన పార్టీ వైసీపీ తరుఫున ఆంధ్రప్రదేశ్ లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఏకమొత్తంలో ఆదివారం ప్రకటించేశారు. ఇందులో చాలా మంది కొత్తపేర్లు, విద్యావంతులు, ఉన్నత అధికారులుగా చేసిన వారు ఉన్నారు. అందరినీ ఆశ్చర్యపరిచేలా జాబితాలో కొత్త వారికి జగన్ అవకాశమిచ్చారు.

ఇక వైసీపీలో ఉండి అనంతర కాలంలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై పార్టీ మారిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు వైఎస్ జగన్ గట్టి షాకే ఇచ్చారు. కర్నూలు ఎంపీ బరిలో టీడీపీ ఈసారి కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డిని టీడీపీలో చేర్చుకొని ఆయనకే టికెట్ ను ఇచ్చింది. బుట్టారేణుక సిట్టింగ్ ఎంపీగా ఉన్నా ఆమెను బాబు కనీసం పరిగణలోకి తీసుకోకుండా మోసం చేశారు. కనీసం ఎమ్మెల్యే సీటు ఇవ్వమన్నా ఇవ్వలేదు. దీంతో బాబు చేసిన మోసంతో దగాపడ్డ బుట్టా రేణుకా రెండు రోజుల క్రితం మళ్లీ జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు.

బుట్టరేణుక తిరిగి వైసీపీలో చేరినా జగన్ పాత విషయాలు మరిచిపోలేదు. తనను నమ్మి కర్నూలులో పార్టీని బతికించిన నేతలకే టికెట్ ఇచ్చారు. బుట్టాను కనికరించలేదు. టికెట్ ను తిరిగి ఇవ్వలేదు. కనీసం ఎమ్మెల్యే టికెట్ ను కూడా బుట్టా రేణుకకు జగన్ కేటాయించలేదు. ఇలా వైసీపీని మోసం చేసి టీడీపీలోకి పోయి అక్కడ బాబును నమ్మి మోసపోయిన వారు చాలా మంది తిరిగి జగన్ సమక్షంలో ఇటీవల వైసీపీలో చేరారు. కానీ వారెవ్వరికీ కూడా జగన్ సీట్లు కేటాయించకపోవడం విశేషం.