Begin typing your search above and press return to search.

సెటిలర్లకు టికెట్లేవి చంద్రశేఖరా?

By:  Tupaki Desk   |   7 Sep 2018 12:03 PM GMT
సెటిలర్లకు టికెట్లేవి చంద్రశేఖరా?
X
నూరు అబద్ధాలు ఆడైన సరే ఓ పెళ్లి చేయాలి......అలాగే ఎన్నిఅబద్ధాలు ఆడైన సరే అధికారాన్ని చేపట్టాలి....ఈ మాట మన తెలంగాణ ఆపద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పొట్ట చేత్తో పట్టుకుని రాజధానికి వలస వచ్చిన వారిని విలన్స్‌ లా చూపించి అధికారం చేపట్టారు. అధికారం వచ్చిన తర్వాత గ్రేటర్‌ ఎన్నికలకు ముందు సెటిలర్లు అందరూ తెలంగాణాకు చెందిన వారే అని మాట మార్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి - ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆయన తన నరం లేని నాలుకతో వాగ్దానాలు చేసి ఆ తర్వాత వాటిని గాలికి వదిలి వేసిన సందర్భాలు కొత్తేం కాదు. ముందస్తుకు వెళ‌దామన్న ఆలోచన రావడంతోనే కేసీఆర్‌ కు సెటిలర్లు గుర్తుకువచ్చారు.

రాబోయే ఎన్నికలలో సెటిలర్లకు టికెట్లు ఇస్తామని కూడా కేసీఆర్ చెప్పారు. గురువారం నాడు ముందస్తుకు పిలుపునిచ్చి - రాబోయే శాసనసభ ఎన్నికలకు ముందుగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో ఎంతమంది సెటిలర్లు ఉన్నారో చెప్పాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ప్రకటించని నియోజకవర్గాలలో సెటిలర్లకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గాలు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. వాటిని టీఆర్ ఎస్ నాయకులు ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోరు. మరి సెటిలర్లకు టీఆర్ ఎస్ తరఫున పోటి చేసే అవకాశం లేదా అని కేసీఆర్‌ ను పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల పార్టీ అని పదే పదే చెప్పే కేసీఆర్ - తెలుగుదేశానికి ఓటు వేస్తే అది ఆంధ్రాపార్టీకి వేసినట్లేనని నర్మగర్భంగా వ్యాఖ్యానించిన సంగతి విదితమే.

అధికారం కోసం పూటకొక మాట మాట్లాడే కేసీఆర్‌ ను ప్రజలు ఎలా నమ్ముతారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. శాసనసభ రద్దు జరిగిన వెంటనే కేసీఆర్ టీడీపీని విమర్శించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రంలో బిజేపీకి కేసీఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి తద్వారా లాభం పొందాలని చూస్తున్నారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమ తదుపరి వ్యూహన్ని త్వరలో ప్రకటిస్తామని, పొత్తుల విషయమై తెలంగాణలోని తమ నాయకులకు పూర్తి స్వేఛ్చ ఉంటుందని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలు రెండూ తమకు రెండు కళ్ల వంటివి అని, రాబోయే రోజులలో తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చి తీరుతామని చంద్రబాబు అన్నారు.