Begin typing your search above and press return to search.

పురుషులతో సమానం.. టికెట్లలో మాత్రం కాదు..

By:  Tupaki Desk   |   5 Oct 2018 10:41 AM GMT
పురుషులతో సమానం.. టికెట్లలో మాత్రం కాదు..
X
టిక్కెట్ల కేటాయింపులో మహిళలకు రాజకీయ పార్టీలు మొండిచేయి చూపుతున్నాయి. విద్యా - వ్యాపార - ఉద్యోగాల్లో సై అంటున్న మహిళలు... రాజకీయాల్లో ఎందుకు వెనక్కు నెడుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అన్నిట్లో సగం అంటూనే చిన్నచూపేంటి అని ప్రశ్నిస్తున్నారు. తమకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. టీఆర్ ఎస్ లో ఇప్పటికే సీట్ల ప్రకటన దాదాపు జరిగిపోయింది. అన్ని సిట్టింగ్ లకే ఇచ్చేశారు. మరి తమ పరిస్థితి అంతేనా అని ప్రశ్నిస్తున్నారు. అధిష్టానాల నుంచి నో అని సమాధానాలు వస్తుండటంతో తిరుగుబావుటా ఎగరేసేలా కనిపిస్తున్నారు.

వరంగల్ జిల్లా... రాణి రుద్రమ దేవి పరిపాలించిన జిల్లా ఇది. అయినా, ఆ స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో జరిగింది ఇప్పుడు కూడా పునరావృతమయ్యేలా ఉంది. టీఆర్ ఎస్ టిక్కెట్ కేటాయించేసింది. ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. టిక్కెట్ల కోసం పోటీ పడుతున్న మహిళా నేతల సంఖ్య కాస్తా ఎక్కువగానే ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే కొండా సురేఖ పరకాల నుంచి పోటీలో నిలిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె పార్టీలో చేరే సమయంలోనే తన కూతురికి సీటు విషయంలో చర్చించినట్లు తెలుస్తుంది. ఆ ప్రయత్నం సత్ఫలితం ఇస్తే సుస్మితా పటేల్ వరంగల్ తూర్పు నుంచి లేదా పరకాలలో పోటీ చేసే అవకాశం ఉంది. జనగామ నుంచి పోటీ చేస్తున్న పొన్నాల లక్ష్మయ్య తన కొడలు వైశాలికి ములుగు టిక్కెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి క్రీయాశీలకంగా ఉన్న మరో కాంగ్రెస్ నేత చందుపట్ల కీర్తిరెడ్డి ఈమె భూపాలపల్లి నుంచి టిక్కెట్ ఆశిస్తుంది. స్టేషన్ ఘన్ పూర్ లో బరిలో నిలిపేందుకు ఇందిర అభ్యర్థిత్వాన్ని పరిశీస్తున్నారట గులాబీ శ్రేణులు. కమలంలో రావు పద్మ పేరును వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేయనున్నట్లు వినిపిస్తుంది.

మహబూబాబాద్ - డోర్నకల్ నియోజకవర్గాలపై కవిత - సత్యవతి రాథోడ్ ల కన్ను ఎప్పటి నుంచో ఉంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూతరు డాక్టర్ కడియం కావ్య కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారట. తండ్రి అండదండలతో స్టేషన్ ఘన్ పూర్ - వర్థన్న పేట నుంచి పోటీకి సిద్ధమవుతున్నారట. ఇటీవల నర్సంపేట నియోజకవర్గానికి గతంలో పోటీ చేసి ఓడిపోయిన పెద్డిరెడ్డి సుదర్శన్ రెడ్డికే టికెట్ ను టీఆర్ ఎస్ ఇచ్చింది. ప్రస్తుతం వరంగల్ తూర్పుకు అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పురుషులే ఆధిపత్యం చూపుతున్నారు. మాజీ ఎంపీ గుండు సుధారాణి కూడా పోటీ చేసేందుకు టిక్కెట్ అడుగుతున్నట్లు సమాచారం.

సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తామని అధిష్ఠానం తెలుపుతున్నా - మహిళలు ప్రయత్నాలు మాత్రం ఆపలేదట. కానీ, టిక్కెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు. తమ పేరును పరిశీలించాలంటూ మహిళా నేతలు వినతులు చేస్తూనే ఉన్నారట. మహిళా నేతల వినతులను అధిష్ఠానం పెడచెవిన పెడుతుండటంతో, నిరాస నిస్ప్రహలకు లోనవుతున్నారు. ఈ ప్రభావం ఎన్నికల్లో ఓటింగ్ సరళిపై ప్రభావం చూపుతుందేమోనని పలువురు విశ్లేషిస్తున్నారు.