Begin typing your search above and press return to search.

జోన్‌ కు కేంద్రం ఓకే...కానీ ఫ‌లితం శూన్యం

By:  Tupaki Desk   |   12 Feb 2018 6:24 AM GMT
జోన్‌ కు కేంద్రం ఓకే...కానీ ఫ‌లితం శూన్యం
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైల్వే జోన్‌....విభ‌జ‌న హామీల్లో అత్యంత కీల‌క‌మైన వాటిల్లో ఇది ఒక‌టి. కేంద్ర ప్ర‌భుత్వం ఈ హామీని నెర‌వేర్చుతుంద‌ని...అప్ప‌టి రైల్వేమంత్రిని రాష్ట్రం నుంచే రాజ్య‌స‌భ‌కు పంపినందున లైన్ క్లియ‌ర్ అవుతుంద‌ని...అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. అయితే ఆ ఆశ‌ల‌న్నీ అడియాస‌లు అయ్యాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ లో మొండిచేయి చూపించింది. దీంతో అన్నివ‌ర్గాలు ఆందోళ‌న‌లు చేయ‌గా...రైల్వేజోన్‌ పై ముందడుగు ప‌డిన‌ట్లు కేంద్రం లీకులు ఇచ్చింది. అయితే తాజాగా ఢిల్లీ వేదిక‌గా సాగుతున్న ప‌రిణామాల ప్ర‌కారం నామ్‌ కే వాస్తీ జోన్ ఇచ్చేందుకు అడుగులు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర విభజన హామీల అమల్లో తీవ్రజాప్యం జరపడంతోపాటు నిధుల మంజూరులో వ్యత్యాసాలపై ఆంధ్రప్రదేశ్‌ లో నెలకొన్న ఆందోళనల్ని తగ్గించే క్రమంలో అటు ఒడిషాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జోన్‌ విదల్చాలని కేంద్రం పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ ఎత్తుగ‌డ ఏపీకి న‌ష్టం చేకూరేలా ఉందంటున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతమున్న విజయవాడ - గుంటూరు - గుంతకల్‌ రైల్వే డివిజన్లతో ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలోని విశాఖ డివిజన్‌ ను కలిపి నాలుగు డివిజన్లతో కొత్తగా జోన్‌ ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. అయితే విశాఖ డివిజన్‌ ను తూర్పు కోస్తా జోన్‌ నుంచి విడదీయడం పట్ల ఒడిశా ఒప్పుకోవడంలేదు. దీర్ఘకాలంగా ఇదే కొత్త జోన్‌ ఏర్పాటుకు అవాంతరమ‌వుతోంది. ఓ పక్క జోన్‌ ఏర్పాటుకు అవకాశాలు మెరుగయ్యాయని ప్రకటనలిస్తూనే మరో పక్క రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ ఒడిషా నుంచి కేంద్ర కేబినెట్‌ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మేంద్రప్రధాన్‌ తో చర్చలు మొదలెట్టారు. ఓ వైపు ఒడిషా ప్రయోజనాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఈ జోన్‌ ఏర్పాటును సాకారం చేసే ఆలోచనలకు పదునెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని సూత్రప్రాయ మార్పులు చేయడం ద్వారా ఒడిషా నుంచి ఎలాంటి ఆగ్రహావేశాలు రాకుండా చూడాలన్నది కేంద్రం యోచనగా తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేసినా ఇక్కడ అదనంగా ఒరిగేదేం ఉండద‌ని నిపుణులు చెప్తున్నారు.

ఎందుకంటే...తూర్పు కోస్తా రైల్వేకొస్తున్న మొత్తం ఆదాయంలో 63 శాతం ఒక్క విశాఖ రైల్వే డివిజన్‌ నుంచే సమకూరు తోంది. ఈ డివిజన్‌ నుంచి వస్తున్న ఆదాయంలో 23శాతం ప్రయాణికుల ద్వారా సమకూరుతుంటే మిగిలినదంతా సరుకుల రవాణా ద్వారానే లభిస్తోంది. డివిజన్‌ పరిధిలో సరుకుల రవాణా ద్వారా వస్తున్న ఆదాయంలో తిరిగి 69శాతం ఒక్క కిరోండల్‌- కొత్తవలస రైల్వేలైన్‌ ద్వారానే సమకూరుతోంది. మొత్తం తూర్పు కోస్తా రైల్వేజోన్‌ కు 446 కిలోమీటర్ల పొడవున్న కెకె లైన్‌ పై వస్తున్న ఆదాయమే అత్యంత కీలకం. విశాఖ డివిజన్‌ను కొత్త జోన్‌లో విలీనం చేస్తే ఈ ఆదాయం మొత్తం కొత్త జోన్‌కు బదలీ అవుతుంది. దీనికే ఒడిషా నుంచి అభ్యంతరాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఒడిషాను సంతృప్తిప‌రిచేందుకు ఈ ఆదాయాన్ని ప‌రిర‌క్షిస్తూనే...ప్రస్తుతం విశాఖలో ఉన్న డీజెల్‌ షెడ్‌ను కూడా ఇక్కడి నుంచి కూర్దారోడ్‌ డివిజన్‌కు తరలించాలని ప్రతిపాదిస్తున్నారని స‌మాచారం.

అంతేకాకుండా...ప్రధాన ఆదాయ వనరు కిరోండల్‌ రైల్వేలైన్‌ ను తప్పించి ఇతర లైన్లతో కూడిన విశాఖ డివిజన్‌ తో సహా కొత్తగా జోన్‌ ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన రీతిలో ఆదాయం సమకూరదు. ఈ ప్రాంతమంతా సాధారణ ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ తప్ప గూడ్స్‌ ట్రాఫిక్‌ ద్వారా పెద్దగా ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదు. అలాగే ప్రధానమైన లోకో షెడ్లు తరలిపోతే ఉద్యోగావకాశాలు కనుమరుగవు తాయి. కొత్త నియామకాలన్నీ తిరిగి భువనేశ్వర్‌ కేంద్రంగా గల తూర్పు కోస్తా పరిధికే దక్కుతాయి. కిరోండల్‌ రైల్వేలైన్‌ తో సహా విశాఖ డివిజన్‌ ను సాధించుకుంటేనే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హామీ నిలుపుకోవ‌డంతో పాటుగా దాని ఫ‌లాలు అందిన‌ప్పుడే రైల్వే జోన్‌ కు సార్థ‌క‌త చేకూరుతుంద‌ని, ఇందుకు అన్ని పార్టీలు కృషిచేయాల‌ని ఆకాంక్షిస్తున్నారు.