Begin typing your search above and press return to search.

జిన్ పింగ్ తో మోదీ భేటీ...ఒరిగేదేమీ లేదా?

By:  Tupaki Desk   |   11 Oct 2019 1:30 AM GMT
జిన్ పింగ్ తో మోదీ భేటీ...ఒరిగేదేమీ లేదా?
X
శుక్రవారం మధ్యాహ్నం తమిళనాడు రాజధాని చెన్నైలో ల్యాండ్ కానున్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్... అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి గ్రాండ్ వెల్ కమ్ అందుకుని ఆ తర్వాత నేరుగా ఇద్దరు నేతలు కారెక్కేసి చెన్నై సమీపంలోని మహాబలిపురం చేరుకుంటారు. అక్కడే రెండు రోజుల పాటు ఉండే ఇద్దరు నేతలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతారు. ఈ భేటీకి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కాగా.. అసలు ఈ భేటీతో భారత్ కు ఒరిగేదేమిటన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఈ శిఖరాగ్ర సమావేశానికి కర్త - కర్మ - క్రియ మాదిరిగా వ్యవహరిస్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కుమారుడు - అమెరికాలోని వాషింగ్టన్‌ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఓఆర్ ఎఫ్‌) డైరెక్టర్‌ గా ధృవ జైశంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్ పింగ్ పర్యటనతో మనకు పెద్దగా ఒరిగేదేమీ లేదని ధృవ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయాయని చెప్పక తప్పదు.

అయినా తండ్రి జైశంకర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా పనిచేసినంత మాత్రాన, ఇప్పుడు ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన ధృవ ఈ విషయాన్ని తేల్చేసేంత తెలివిగలవాడా? అన్న అనుమానాలు అక్కర్లేదు. ఎందుకంటే... అమెరికాలోని వాషింగ్టన్‌ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఓఆర్ ఎఫ్‌)... ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల విదేశాంగ విధానాలు - పొరుగు దేశాల మధ్య దౌత్య సంబంధాల పరిశీలన, ఎగ్జిమ్‌ పాలసీ వంటి అంశాలపై అధ్యయనం కోసమే ఏర్పాటైన సంస్థ. దానికి డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్న ధృవ జైశంకర్‌ ను అంత ఈజీగా తీసేయలేం కూడా. తండ్రికి తగ్గ తనయుడిగా అంతర్జాతీయ వ్యవహారాలపై తనదైన శైలి పట్టు సాధించిన ధృవ... మహాబలిపురం శిఖరాగ్ర సదస్సుపై చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా మారింది.

సరే... మరి ఈ భేటీపై ధృవ ఏమంటున్నారన్న విషయానికి వస్తే... జమ్మూ కాశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దు తరువాత భారత్‌ - పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుందని - ప్రస్తుతం అన్ని దేశాల చూపు వారిద్దరి భేటీపైనే నిలిచిందని ధృవ విశ్లేషిస్తున్నారు. అయితే జిన్‌పింగ్‌ పర్యటన వల్ల భారత్‌ కు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలోపేతం కావడానికి జిన్‌పింగ్‌ పర్యటన ఉపయోగపడుతుందని ఆయన అంచనా వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జిన్‌ పింగ్‌ మధ్య చోటు చేసుకునే శిఖరాగ్ర సమావేశం దౌత్య సంబంధాల మీదే ప్రధానంగా కేంద్రీకతమైనట్లు కనిపిస్తుందని చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన అంశాలపై విస్తృత చర్చ జరిగే అవకాశాలు ఎంతమాత్రం లేవని, రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని, ఆయా అంశాలపై చర్చించడానికి రెండు దేశాలు పెద్దగా సుముఖంగా లేవని ధృవ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

భారత్‌ సహా 16 దేశాలు చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిన విషయాన్ని ధృవ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ప్రతిబంధకాల వల్ల భారత్‌ ఆర్థికంగా నష్టపోయిందని, ఈ లోటును భర్తీ చేసుకోవడానికి చైనాకు ఎగుమతులను మరిన్ని రంగాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్‌ వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్‌ రంగానికి చెందిన ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేయడం వల్ల లోటును భర్తీ చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా గుర్తింపు పొందిన భారత్‌, చైనాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవన్న విషయం తెలిసిందేనని, దీన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు వాణిజ్య అంశాల్లో సఖ్యత సాధించడానికి తమ వంతు ప్రయత్నాలు చేయాల్సి ఉందని ఆయన చెబుతున్నారు. చైనా భారత్‌తో కాకుండా పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకోవాలనుకోవడం ఆందోళనకరమని, ఇందుకు భారత్‌ కొత్తగా విదేశాంగ విధానాలు, వ్యూహాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు.