Begin typing your search above and press return to search.

చిన్నమ్మకు ఫైనల్ షాకిచ్చిన జడ్జి..

By:  Tupaki Desk   |   15 Feb 2017 1:46 PM GMT
చిన్నమ్మకు ఫైనల్ షాకిచ్చిన జడ్జి..
X
అనుకున్నవన్నీ జరగవు. ఇది అందరికి తెలిసిన మాటే. కానీ.. గడిచిన తొమ్మిది రోజులుగా చిన్నమ్మ వ్యవహారాన్ని చూస్తే.. ఆమె ఏమనుకున్నా జరగని పరిస్థితి. కోర్టుల్లో ఆమె నోటి నుంచి ఎలాంటి అభ్యర్థన వచ్చినా.. షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీఎం కావాలనుకున్న రోజు నుంచి ఆమెకు ఊహించని ఎదురుదెబ్బలు తగలటం షురూ అయ్యిందని చెప్పాలి. అలా మొదలైన షాకుల పర్వం తాజాగా.. ఫైనల్ షాక్ తగిలిందని చెప్పాలి.

అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ అయి.. నాలుగేళ్ల జైలుశిక్ష.. పది కోట్ల జరిమానా చెల్లించాలంటూ ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే.. నాలుగు వారాల గడువు కోరుతూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు. అనారోగ్యం కారణంగా తనకు నాలుగువారాల సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు కోర్టు నో అంటే నో చెప్పేసింది.

దీంతో.. ఆమె ప్రత్యేక కోర్టు ఎదుట లొంగిపోక తప్పలేదు. దాదాపు మూడున్నరేళ్ల పాటు జైల్లో ఉండాల్సిన ఆవిడ.. తనకు జైల్లో వసతులు కల్పించాలంటూ చిట్టా విప్పారు. మినరల్ వాటర్.. వేడి నీళ్లు.. ఏసీ గది.. టీవీ రూమ్.. ప్రత్యేక సెల్.. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవటం లాంటివి కోరుకున్నారు.అయితే.. ఆమె విన్నపాల్లో ఏ ఒక్కదానికి కోర్టు నుంచి సానుకూల స్పందన రాకపోవటం గమనార్హం.

ఆమెను సాధారణ ఖైదీ మాదిరే ట్రీట్ చేయాలని న్యాయమూర్తి తేల్చారు. సీఎం కావాలనుకున్న నాటి నుంచి మొదలైన షాకుల పర్వంలో.. ఇది ఫైనల్ షాక్ గా చెప్పక తప్పదు. ఇక.. శశికళకు ఖైదీ నంబరు ‘‘9234’’ను కేటాయించారు. దీంతో.. తమిళనాడు సరిహద్దులకు సమీపంలో ఉండే కర్ణాటకలోని పరప్పణ అగ్రహార కోర్టులో ఆమె ఒక సాదాసీదా ఖైదీలా.. మూడున్నరేళ్ల పాటు తన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. సీఎం కావాలని ఆశపడి..ఆరాటపడి.. అందుకు తగ్గ ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాని శశికళ పరిస్థితి చూసినప్పుడు చటుక్కున.. ‘‘అతిగా ఆశ పడే ఆడది..అతిగా ఆవేశపడే మగాడు సుఖపడింది లేదు’’ అన్న డైలాగ్ గుర్తుకు రావటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/