Begin typing your search above and press return to search.

''ఆపరేషన్‌'' చేయించుకున్న వాళ్లకే ఓటుహక్కు?

By:  Tupaki Desk   |   13 April 2015 11:16 PM IST
ఆపరేషన్‌ చేయించుకున్న వాళ్లకే ఓటుహక్కు?
X
ఎవరికి నచ్చినట్లు.. ఎవరికి తోచినట్లుగా వ్యాఖ్యలు చేసేయటం అలవాటైంది. ఒకరేమో.. డజను మంది పిల్లల్ని కనమని చెబుతారు. మరికొందరు కనీసం ఆరుగురు అయినా కనాలంటారు. ఇలా పిల్లల్ని కనాలనే వారికి మతం ఆధారంగా మాట్లాడేస్తుంటారు. ఇలా పిల్లలు పుట్టించాలని కోరుకున్న వారిలో బీజేపీ నేతల నుంచి ఏపీ ముఖ్యమంత్రి.. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ వరకు అందరూ ఉన్నారు.

ఇదిలా ఉంటే.. పిల్లల్ని అధికంగా కనే ముస్లింలకు ఓటహక్కు రద్దు చేయాలంటూ శివసేన తాజాగా నినదించి మరో కలకలానికి తెర తీసింది.ఇలా ఎవరికి వారు మహిళల్ని సంతానాల ఫ్యాక్టరీలుగా మారిపోవాలని ఆర్డర్లు వేసేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీ ఎంపీ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాక్షి మహారాజ్‌ సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు.

పిల్లల్ని కనటం కాదు.. పిల్లల్ని కనకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకునే వారికి ఓటహక్కు కల్పించాలని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో దేశంలోని ప్రతిహిందువు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని ప్రకటన చేసిన సాక్షి మహారాజ్‌ తాజాగా కుటుంబ నియంత్రణ చేయించుకున్న వారికే ఓటుహక్కు ఉండాలని వ్యాఖ్యానించటం విశేషం.

తాను చెబుతున్న మాటలు ముస్లింలు.. క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదని.. వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోరని తాను చెప్పటం లేదని వ్యాఖ్యానించారు. ఎవరికి వారు కుటుంబ నియంత్రణ పాటించి ఉండే దేశ జనాభా 130 కోట్లను దాటి ఉండేది కాదని చెప్పుకొచ్చారు.

మొత్తానికి మొన్నటివరకూ ముగ్గురు పిల్లల్ని కనాలని చెప్పిన పెద్దమనిషి.. ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కి ఓటుహక్కుకు లింకు పెడుతున్నారు. మరికొద్ది రోజులు ఆగితే మరెలాంటి మాట చెబుతారో..? ఇలా తోచినప్పుడు.. తోచిన మాట చెప్పటం చూస్తుంటే ప్రజలంటే రాజకీయ నాయకులకు అలుసా అన్న భావన కలగటం ఖాయం.