Begin typing your search above and press return to search.

మాల్యా పారిపోలేదు..స్పోర్ట్స్ గేమ్స్‌ కు వెళ్లారంతే!

By:  Tupaki Desk   |   13 Dec 2018 7:09 AM GMT
మాల్యా పారిపోలేదు..స్పోర్ట్స్ గేమ్స్‌ కు వెళ్లారంతే!
X
లిక్క‌ర్ కింగ్‌ - విలాస‌పురుషుడు విజ‌య్‌ మాల్య‌ బ్యాంకులకు రూ.9,000 కోట్లకు పైగా బకాయిలను ఎగ్గొట్టి దాదాపు మూడేండ్ల క్రితం మాల్యా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాల్యాను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లండన్ కోర్టులో ఎడతెగని పోరాటమే చేయగా, అది ఎట్టకేలకు ఇప్పుడు ఫలించింది. భారత్‌ కు మాల్యా అప్పగింత కేసులో వెస్ట్‌ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ జడ్జీ ఎమ్మా అర్బుత్నట్ సోమవారం ఇక్కడ తీర్పును వెల్లడిస్తూ భారత్ వాదనలో అర్థమున్నదని అభిప్రాయపడ్డారు. సీబీఐ - ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలపై విచారణకు వీలుగా మాల్యాను భారత్‌ కు అప్పగించాలి అన్నారు. ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున మాల్యాకు రుణాలు ఎలా? మంజూరయ్యాయి. ఆ నిధులు ఏమయ్యాయి? అన్నదానిపైనా న్యాయమూర్తి అర్బుత్నట్ విస్మయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

అయితే, తాజాగా ఈ ఎపిసోడ్‌ లో ఆస‌క్తిక‌ర‌మైన అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. అందరూ భావిస్తున్నట్లుగా 2016 - మార్చి 2న విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోలేదని - స్విట్జర్లాండ్‌ లోని జెనీవాలో జరుగుతున్న వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే 300 బ్యాగులతో - భారీ కార్గోతో ఓ సమావేశానికి ఎవరైనా వెళ్తారా అని ఈడీ న్యాయవాది ప్రశ్నించారు. పీఎంఎల్‌ ఏ ప్రత్యేక కోర్టులో మాల్యా తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ - ఈడీ న్యాయవాది డీఎన్ సింగ్ మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్నది. పీఎంఎల్‌ ఏ కోర్టు న్యాయమూర్తి ఎంఎస్ అజ్మీ ముందు మంగళవారం అమిత్ దేశాయ్.. మాల్యా రహస్యంగా దేశం వీడిపోయారన్నదానిలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. ముందుగా ఖరారైన ఓ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకే వెళ్లారని అన్నారు. దీనిపై బుధవారం ఈడీ తరఫు న్యాయవాది సింగ్ స్పందిస్తూ ఓ సమావేశానికి పెద్ద ఎత్తున సంచులు - సరుకుతో వెళ్తారా? అని నిలదీశారు. పరారీ ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద మాల్యాను ప్రకటించాలంటూ కోర్టును ఈడీ కోరుతున్నది. ఈ క్రమంలోనే ఈ వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి.

అప్పగింత కేసు తీర్పు సందర్భంగా కోర్టుకు వచ్చిన మాల్యా.. అక్కడ విలేఖరులతో మాట్లాడుతూ భారతీయ బ్యాంకులకు బకాయిపడిన మొత్తంలో అసలును చెల్లిస్తానని చెబుతూనే ఉన్నానని - అయినప్పటికీ ఎవరూ నమ్మడం లేదన్నారు. తనది బోగస్ ఆఫర్ కాదన్నారు. కర్నాటక హైకోర్టు ఎదుట కూడా సెటిల్ మెంట్ ఆఫర్‌ ను పెట్టినట్లు గుర్తుచేశారు. న్యాయవ్యవస్థను ఎవరూ ఏమార్చలేరన్న మాల్యా.. ఈడీ తన ఆస్తులను జప్తు చేసిందని - అవి ఉత్తుత్తి ఆస్తులైతే జప్తుకు వీలుంటుందా? అని ప్రశ్నించారు. తనపై పరారీ ఆర్థిక నేరగాడి ముద్ర వేశారని - బ్యాంకుల మోసాల బ్రాండ్ అంబాసిడర్‌ గా నిలబెట్టారని ఒకింత ఆవేదన వ్యక్తం చేసిన మాల్యా...సెటిల్ మెంట్ ఆఫర్‌ కు కర్నాటక హైకోర్టు అనుమతిస్తే కింగ్‌ ఫిషర్ ఉద్యోగుల బకాయిలనే తొలుత తీరుస్తానన్నారు. ఇక ఈ విషయంలో తాను చెప్పాల్సింది చెప్పేశానని, ఇంకా చెప్పేందుకు ఏమీ లేదన్నారు. కాగా, తాజా తీర్పును తమ న్యాయవాదులు సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ మేర‌కు మాల్యా న్యాయ‌వాదులు తాజా వాద‌న వినిపించారు.