Begin typing your search above and press return to search.

రష్యాకు నోకియా షాక్

By:  Tupaki Desk   |   13 April 2022 4:54 AM GMT
రష్యాకు నోకియా షాక్
X
ప్రముఖ టెలికాం కంపెనీ నోకియా రష్యాకు పెద్ద షాకిచ్చింది. మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ నోకియా ప్రపంచంలో ఒకప్పుడు ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ రష్యాలో మంచి పేరున్న సంస్థే. గడచిన నెలన్నరగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా వైఖరి నచ్చకే తమ కంపెనీ కార్యకలాపాలను రష్యా నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. మొబైల్ ఫోన్ల అమ్మకాలతో పాటు రీసెర్చి, పరిశోధన, సర్వీసింగ్ సెంటర్లన్నింటినీ రష్యా నుంచి ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది.

రష్యాలో మొబైల్ ఫోన్ల అమ్మకాలు 2021లో 2 శాతం మాత్రమే అని యాజమాన్యం చెప్పింది. కాబట్టి రష్యా నుండి తమ కంపెనీ మొబైల్ ఫోన్ల అమ్మకాలు, సర్వీసింగ్, రీసెర్చిని ఆపేసిన తమ కంపెనీ ఆర్ధిక వ్యవహారాలపై పడే ప్రభావం కూడా పెద్దగా ఉండదని యాజమాన్యం స్పష్టంచేసింది.

యుద్ధం మొదలైనపుడే రష్యాలో తమ కార్యకలాపాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు తక్కువని అనిపించినట్లు యాజమాన్యం చెప్పింది.

అయితే ఎన్ని రోజులయినా యుద్ధం ఆగే సూచనలు లేకపోవటంతో పాటు ఉక్రెయిన్ నాశనానికే రష్యా కట్టుబడి ఉండటం తమను కలచివేసిందన్నది. యుద్ధం కారణంగా ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు అనేక కీలక నగరాలన్నీ దాదాపు నేలమట్టమైపోయిన విషయం తెలిసిందే. రోజు రోజుకు ఉక్రెయిన్లో పరిస్ధితులు దారుణంగా తయారవ్వటమే తప్ప యుద్ధం ఆగుతుందన్న ఆశకూడా అడుగంటుతోంది.

రష్యా మీద ప్రపంచదేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని కంపెనీలు దేశం నుండి వెళ్ళిపోయినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అంతర్జాతీయంగా చాలా దేశాలు రష్యాపై ఇప్పటికే ఆర్ధికపరమైన ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో రష్యా నుంచి బొగ్గు కొనుగోళ్ళను నిలిపేయాలని యూరోపు దేశాలు నిర్ణయం తీసుకున్నా రష్యా పెద్దగా పట్టించుకోవటంలేదు. ఇలాంటి పరిస్దితుల్లోనే ఫిన్లాండ్ కు చెందిన నోకియా మొబైల్ తయారీ కంపెనీ కూడా రష్యా నుండి నిష్క్రమిస్తోంది.