Begin typing your search above and press return to search.

సక్సెస్ పుల్ గా 216వ సారి నామినేషన్ వేశారు

By:  Tupaki Desk   |   15 March 2021 1:28 AM GMT
సక్సెస్ పుల్ గా 216వ సారి నామినేషన్ వేశారు
X
ఒలింపిక్స్ లో గెలుపు కంటే.. అందులో పాల్గొనటమే గెలుపుతో సమానమన్నట్లుగా.. తమిళనాడుకు చెందిన అరవైఏళ్ల పద్మరాజన్ తీరు.. మిగిలిన నేతలకు పూర్తి భిన్నం. ఎన్నికలు జరుగుతుంటే చాలు.. వెనుకా ముందు చూసుకోకుండా నామినేషన్ వేసేస్తుంటారు. ఇలా ఇప్పటికి ఏకంగా 216సార్లు నామినేషన్లు వేశారు. తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయటం ద్వారా మరోసారి తన లక్ ను పరీక్షించుకోవాలని ఆయన భావిస్తున్నారు.

సేలం జిల్లా మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతేనా.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడైపాడి పళనిస్వామి పోటీ చేస్తున్న ఎడైపాడి నియోజకవర్గంలోనూ స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న పద్మరాజన్.. టైర్లను రీ ట్రేడింగ్ చేసే వ్యాపారంలో ఉన్నాడు. ఎన్నికలు ఏవైనా సరే.. గెలుపోటములతో పని లేకుండా నామినేషన్ దాఖలు చేయటం ఆయనకు అలవాటు.

స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు ఎంపీ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేసే ఆయన.. ఇప్పటివరకు ఏ ఎన్నికలోనూ విజయం సాధించకపోవటం ఆయన ప్రత్యేకత. అయినప్పటికి అలుపెరగక.. అదే పనిగా పోటీ చేయటం ఆయన ప్రత్యేకత. అంతే కాదు.. ప్రముఖులపై పోటీ చేయటం ఆయనకో అలవాటుగా చెబుతారు. అందుకే ఆయన్ను ఎన్నికల రాజా అని పిలుస్తుంటారు.