Begin typing your search above and press return to search.

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు నామినేష‌న్లు మొద‌లు.. అభ్య‌ర్థులేరి?

By:  Tupaki Desk   |   5 July 2022 3:00 AM GMT
ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు నామినేష‌న్లు మొద‌లు.. అభ్య‌ర్థులేరి?
X
ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు జూలై 5 నుంచి నామినేష‌న్లు ప్రారంభం కానున్నాయి. అయితే కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున‌, విప‌క్షాల త‌ర‌ఫున ఇంత‌వ‌ర‌కు అభ్య‌ర్థులు ఖ‌రారు కాలేదు. ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య నాయుడు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప‌ద‌వీకాలం ఆగ‌స్టు 10న ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో 16వ భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జూన్ 29న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

కొత్త ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు జూలై 19 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీకరిస్తారు. వాటిని 20వ తేదీన‌ పరిశీలిస్తారు. నామినేష‌న్ల‌ ఉపసంహరణకు తుది గడువు జులై 22. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఆగస్టు 6న ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ నిర్వహిస్తారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులు. నామినేటెడ్‌ సభ్యులకూ అర్హత ఉంటుంది.

కాగా ఇంత‌వ‌ర‌కు కేంద్రంలోని అధికార కూట‌మి ఎన్డీయే త‌ర‌ఫున‌, ప్ర‌తిప‌క్షాల త‌ర‌పున అభ్య‌ర్థులు ఖరారు కాని సంగ‌తి తెలిసిందే. ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ర‌క‌ర‌కాల పేర్లు తెర‌మీద‌కొస్తున్నాయి.

ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్, తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌క్వీ త‌దిత‌రుల పేర్లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు ఇంత‌వ‌ర‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిని నిల‌పాలో, వ‌ద్దో నిర్ణ‌యించ‌లేదు. అటు లోక్ స‌భ, ఇటు రాజ్య‌స‌భ‌లో ఎన్డీయే కూట‌మికి బ‌లం ఎక్కువ‌ ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం.

ఈ నేప‌థ్యంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో ప్ర‌తిప‌క్షాలు త‌మ అభ్య‌ర్థిని బ‌రిలోకి దించ‌వ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో పోటీ చేసి గెల‌వ‌డానికి కూడా ప్ర‌తిప‌క్షాల‌కు బ‌లం లేదు. అయినా త‌మ అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హాను బ‌రిలో దించాయి.