Begin typing your search above and press return to search.

ముగిసిన నామినేషన్ల ఘట్టం.. ఇక అసలు కథ!

By:  Tupaki Desk   |   25 March 2019 12:25 PM GMT
ముగిసిన నామినేషన్ల ఘట్టం.. ఇక అసలు కథ!
X
దేశ వ్యాప్తంగా తొలి దశ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏప్రిల్ పదకొండున పోలింగ్ జరిగే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలకు గడువు పూర్తి అయ్యింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలతో ఆ ప్రక్రియ పూర్తి అయ్యింది. బరిలో ఉండదలుచుకున్న అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు సమయాతీతం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇక అసలు కథ మొదలైందని చెప్పవచ్చు.

పార్టీలల తరఫున నామినేషన్ల ఘట్టం కూడా హోరాహోరీగా సాగింది. ఆయా పార్టీల నేతలు తమ సత్తా చూపించేందుకు నియోజకవర్గం స్థాయిలో భారీ ర్యాలీలను నిర్వహించారు. ఈ విషయంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడ్డాయి. నియోజకవర్గాల కేంద్రాల్లో పదివేల - పాతిక వేల మందితో కలిసి ర్యాలీలు నడిచాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఎన్నికల ప్రచారాలను చేపడుతూనే మరోవైపు .. నామినేషన్ల ఘట్టాన్ని కూడా నేతలు విజయవంతంగా పూర్తి చేశారు.

ఇక రేపు, ఎల్లుండి నామినేషన్ల పరిశీలన ఘట్టం ఉంటుంది. ఎన్నికల విధుల్లోని అధికారులు రేపు, ఎల్లుండి అభ్యర్థులు ఇచ్చిన నామినేషన్ల పత్రాలను పరిశీలిస్తారు. ఏ ఒక్క అంశం ఆ పత్రాల్లో క్లియర్ గా లేకపోయినా.. నామినేషన్ల తిరస్కరణకు అవకాశం ఉంటుంది. ఒక్కసారి తిరస్కరణకు గురి అయ్యాయంటే ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా ఇక అవకాశం లేనట్టే. అందుకే నేతలు ఒకటికి రెండు మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఒకరికి ఇద్దరు నామినేషన్లు వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి.

పరిశీలన అనంతరం.. నామినేషన్ల విత్ డ్రా అంకం ఉంటుంది. ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకూ అందుకు గడువు ఉంటుంది. ఎవరైనా ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటే.. ఇరవై ఎనిమిదో తేదీలోగా తమ నామినేన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధాన పార్టీల తరఫు నుంచి చాలా నియోజకవర్గాల్లో రెబెల్స్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజులు అందుకు సంబంధించి బుజ్జగింపులు ఉండవచ్చు.