Begin typing your search above and press return to search.

భూమాకు నాన్ బెయిల్ బుల్ తప్పలేదు

By:  Tupaki Desk   |   5 July 2016 5:13 AM GMT
భూమాకు నాన్ బెయిల్ బుల్ తప్పలేదు
X
ఏపీ విపక్షం నుంచి అధికారపక్షానికి మారిన నేతల్లో కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి ఒకరు. గతంలో ఒక కేసు ఉదంతంలో నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ కాగా.. తాజాగా ఆయనపై మరో నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ కావటం గమనార్హం. సైకిల్ ఎక్కిన తర్వాత కూడా ఆయనకు పాత కేసుల తాలూకు తిప్పలు తప్పేలా లేవు. 2015 మేలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో భూమాకు.. డీఎస్పీ దేవదానంకు మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా ఈ కేసును నమోదు చేశారు.

డీఎస్పీని తిట్టినట్లుగా భూమాపై కేసు నమోదైంది. అనంతరం ఈ కేసులో అరెస్ట్ అయిన భూమా కొద్దికాలానికి బెయిల్ మీద బయటకు వచ్చారు. అనంతరం కోర్టు విచారణలో భాగంగా రెండుసార్లు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నా హాజరు కాలేదు. సోమవారం మరోసారి విచారణ జరగటం.. అనారోగ్యం కారణంగా భూమా కోర్టుకు హాజరుకాకపోవటంతో ఆయనపై నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను జారీ చేశారు. కేసుల్లో భాగంగా కోర్టు విచారణకు గైర్హాజరు కావటం.. కోర్టు ధర్మాగ్రహానికి గురై.. చెంపలేసుకోవటం ఈమధ్య కాలంలో నేతలకు.. ఉన్నతాధికారులకు ఒక అలవాటుగా మారింది. తమ చేష్టలతో లేనిపోని తిప్పలు తెచ్చుకునే నేతలు.. కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే కోర్టు తిప్పలు చాలానే తప్పుతాయి. కానీ.. ఈ విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం వారికి కొత్త కష్టాల్ని తెచ్చి పెడుతుందనటంలో సందేహం లేదు. భూమా ఇందుకు మినహాయింపు కాదు.