Begin typing your search above and press return to search.

ఆ దేశ సృష్టిక‌ర్త‌కు రేప్ కేసులో నాన్ బెయిల్‌బుల్ వారెంట్

By:  Tupaki Desk   |   19 Aug 2022 10:30 AM GMT
ఆ దేశ సృష్టిక‌ర్త‌కు రేప్ కేసులో నాన్ బెయిల్‌బుల్ వారెంట్
X
వివాదాస్ప‌ద స్వామీజీ నిత్యానంద‌కు ఓ రేపు కేసులో చుక్కెదురు అయ్యింది. ఆయ‌న‌పై న్యాయ‌స్థానం నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు శివారులోని బిడ‌దిలో ఆశ్ర‌మాన్ని నిర్వ‌హించారు.. నిత్యానంద‌స్వామి. దేశ విదేశాల్లో ఆయ‌న‌కు ఎన్నో ల‌క్ష‌ల మంది భ‌క్తులు ఉన్నారు.

ముఖ్యంగా యోగాలో క్రియ ప్ర‌క్రియ‌కు సంబంధించి ఆయ‌న క‌నిపెట్టిన విధానం ఎంతోమంది భ‌క్తుల‌ను రోగాల నుంచి విముక్తి చేసింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆశ్ర‌మానికి భ‌క్తులు పోటెత్తేవారు.

ఇదే క్ర‌మంలో సినీ న‌టి రంజిత కూడా నిత్యానంద స్వామికి అప‌ర భ‌క్తురాలిగా మారారు. ఈ నేప‌థ్యంలో ఆమెతో రాస‌లీల‌లు చేస్తూ నిత్యానంద వీడియోల‌కెక్కారు. ఈ వ్య‌వ‌హారంలో ఆయ‌న త‌న పేరు ప్ర‌తిష్ట‌ల‌ను బాగా పోగొట్టుకున్నారు. ఆ త‌ర్వాత ప్రత్యేకంగా కైలాస దేశం ఏర్పాటు చేశారు. ఈక్వెడార్ లోని ఒక దీవిని కొనుగోలు చేసి నిత్యానంద స్వామి అక్క‌డే ఉంటున్నారు. ప్ర‌త్యేక క‌రెన్సీ, ప్ర‌త్యేక రాజ‌ధానిని కూడా కైలాస దేశంలో ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండ‌గా ఆశ్ర‌మంలో ఉన్న‌ప్పుడే ఒక మ‌హిళ మీద అత్యాచారం చేశాడ‌ని ఆయ‌న‌పై ఇప్ప‌టికే ఒక కేసు న‌మోదై ఉంది. బిడది ఆశ్రమంలో తన మీద నిత్యానందస్వామి అత్యాచారం చేశారని ఆయన ఆశ్రమంలో ఉంటున్న ఓ వివాహిత మహిళ 2010లో బిడది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగ‌తి తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు నిత్యానందతో పాటు ఆయన శిష్యులు కొందరిని అరెస్టు చేసి రామనగర జైలుకు త‌ర‌లించారు. ఈ కేసులో నిత్యానంద కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఆ త‌ర్వాత హైకోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో కొన్నేళ్ల‌పాటు కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌యిన నిత్యానంద.. మూడేళ్ల క్రితం దేశం వ‌దిలి పారిపోయాడు. దీంతో ఆయ‌న‌పై బ్లూ కార్న‌ర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఆయ‌న పాస్‌పోర్టును బ్లాక్ చేశారు. ఇప్పుడు తాజాగా కోర్టు ఆయ‌న‌కు నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.

కాగా ఇటీవ‌ల ఆయ‌న మ‌ర‌ణించారంటూ మీడియాలో వార్త‌లు వచ్చాయి. అయితే తాను మ‌ర‌ణించ‌లేద‌ని.. గాఢ స‌మాధి స్థితిలో ఉన్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా నిత్యానంద స్వామి ప్ర‌క‌టించాడు.