Begin typing your search above and press return to search.

నూర్జహాన్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యిందే

By:  Tupaki Desk   |   30 Nov 2015 9:14 AM GMT
నూర్జహాన్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యిందే
X
ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్షుడు స్కూల్ కి వెళతాడు. అక్కడి చిన్నారులతో ముచ్చట్లు చెబుతారు. వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ప్రపంచ దిగ్గజ వ్యాపార సంస్థల అధిపతులు.. విశ్వవిద్యాలయాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతుంటారు. వారికి తమ అనుభవాలు చెబుతుంటారు. అయితే.. ఇలాంటివి మన దేశంలో కనిపించరు. దేశ ప్రధానమంత్రి వరకూ ఎందుకు.. ఒక ముఖ్యమంత్రి తరచూ స్కూళ్లకు వెళ్లటం.. అక్కడి మౌలిక వసతులు చూడటం.. అక్కడి విద్యా బోధన ఎలా సాగుతుందన్న విషయాల్ని పట్టించుకోవటం.. ప్రభుత్వమే నాణ్యమైన విద్యను అందించేలా చేయటం లాంటివి అస్సలు చేయరు. నిజానిక అలాంటి ఆలోచనలు కూడా చేయరు. ఇలాంటి దేశంలో ఒక ప్రధానమంత్రి తన మనసులోని భావాల్ని.. తనకు తెలిసిన.. తన ఎరుకలోకి వచ్చిన విషయాలతో పాటు.. సామాన్యులుగా ఉంటూ అసాధారణ ఫలితాలు సాధిస్తున్న వారికి సంబంధించిన సక్సెస్ స్టోరీల్ని చెప్పటం అస్సలు కనిపించదు.

కానీ.. దాన్ని బ్రేక్ చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ. మన్ కీ బాత్ పేరిట ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు.. వివిధ సమావేశాల్లో ప్రసంగించే సమయంలో ఆయన సామాన్యులకు సంబంధించి అద్భుతమైన విషయాల్ని ప్రస్తావిస్తుంటారు. దేశ ప్రధాని లాంటి వ్యక్తి నోటి నుంచి సామాన్యుల సక్సెస్ స్టోరీలు వినే ఒక కొత్త అనుభూతి దేశ ప్రజలకు లభిస్తోంది. తాజాగా ప్రధాని మోడీ నోటి నుంచి నూర్జహాన్ అనే 55 ఏళ్ల మహిళ కథ ఒకటి బయటకు వచ్చింది. ప్రధాని నోటి వెంట ఆమె ప్రస్తావనతో ఒక్కసారిగా ఆమె మీద మీడియా నుంచి అందరి చూపులు పడ్డాయి. ఇంతకీ ఈ నూర్జహాన్ ఎవరు? ఆమె ఏం సాధించిందో చూస్తే.. చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

కాన్పూర్ కు చెందిన 55 ఏళ్ల నూర్జహాన్ సోలార్ ల్యాంప్ లను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తోందని.. దాదాపుగా 500 ఇళ్లకు సౌరదీపాల్ని అద్దెకు ఇస్తున్న ఆమె.. నెలకు రూ.100 చొప్పున అద్దె వసూలు చేస్తారని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. రోజుకు ఛార్జింగ్ చేయటానికి రూ.3 నుంచి రూ.4 మాత్రమే ఖర్చు అవుతుందని పేర్కొన్న మోడీ.. నూర్జహాన్ అంటే వెలుగునివ్వటమని.. పేరుకు తగ్గట్లే ఆమె ఎంతో మంది ఇళ్లకు వెలుగునిస్తున్నారని కొనియాడారు. ఇదిలా ఉంటే.. నూర్జహాన్ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే ఆమె ధైర్యానికి ముగ్దులు కావాల్సిందే.

దాదాపు 20 ఏళ్ల క్రితం భర్తను పోగొట్టుకున్న ఆమె.. తానెలా బతకాలి? పిల్లల్ని ఎలా పోషించాలో అర్థం కాక చాలా ఇబ్బందికి గురైంది. కూలి పనులు చేస్తూ రుకు రూ.15 సంపాదనతో ఇంటిని నడిపేది. అలాంటి ఆమె జీవితం మూడేళ్ల క్రితం ఆమె తీసుకున్న నిర్ణయంతో మొత్తంగా మారిపోయింది. ఒక ఎన్జీవో సహకారంతో సౌరదీపాలు పొందిన ఆమె.. వాటిని అద్దెకు ఇవ్వటం మొదలు పెట్టారు. అలా ఆమె ఇప్పుడు 500 మందికి అద్దెకు ఇస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తాజాగా మోడీ ప్రస్తావనతో ఆమె రాత్రికి రాత్రే ప్రముఖ వ్యక్తిగా మారిపోయారు. ఆమె ఇంటికి జాతీయ మీడియా క్యూ కడుతోంది. ప్రధానమంత్రి తన పేరును ప్రస్తావించటం.. తన గురించి చెప్పటంపై ఆ మహిళ నమ్మలేకపోతోంది. మోడీ పుణ్యమా అని తనకు లభించిన గుర్తింపుతో పాటు.. ప్రభుత్వం నుంచి ఆమె కాస్తంత సహకారం కోరుకుంటోంది. ప్రభుత్వ సహకారంతో మరిన్ని సోలార్ లైట్లను తీసుకొచ్చి.. అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది. నిజమే.. ఇలాంటి నూర్జహాన్ లు కోట్లాది మంది భారతీయులకు ఇచ్చే స్ఫూర్తి ఎంతో. ఇలాంటి వారి కథనాల్ని దేశ ప్రజలకు చెప్పినందుకు ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పాల్సిందే.