Begin typing your search above and press return to search.

మెగా ఈవెంట్ కోసం బద్ధ శత్రువులు కలుస్తున్నాయ్

By:  Tupaki Desk   |   14 Feb 2019 1:30 AM GMT
మెగా ఈవెంట్ కోసం బద్ధ శత్రువులు కలుస్తున్నాయ్
X
రెండు కొరియా దేశాల శత్రుత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా ఆ రెందు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఐతే ఈ మధ్య రెండు దేశాల మధ్య స్నేహం చిగురించింది. మహా మొండి ఘటమైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. ఈ మధ్య శైలి మార్చాడు. పొరుగు దేశాలకు స్నేహ హస్తం చాటుతున్నాడు. మూడేళ్ల కిందటే దక్షిణ కొరియా అధ్యక్షుడితో కిమ్ సమావేశం కావడం తెలిసిన సంగతే. ఇప్పుడు రెండు దేశాల సంబంధాలు మరింత మెరుగు పడే దిశగా మరో పెద్ద ముందడుగు పడింది. 2032 ఒలింపిక్స్‌‌ ను ఉమ్మడిగా నిర్వహించేందుకు దక్షిణ కొరియా - ఉత్తర కొరియా సిద్ధపడటం విశేషం. ఈ రెండు దేశాలు కలిసి సంయుక్తంగా 2032 ఒలింపిక్స్‌ బిడ్‌ ను వేయనున్నాయి. స్విట్జర్లాండ్‌ లోని లుసానెలో ఈ శుక్రవారం బిడ్డింగ్‌ కార్యక్రమంలో తాము కలిసి పాల్గొంటున్నట్లు ఈ రెండు దేశాలు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీకి సమాచారం అందించాయి.

ఒలింపిక్స్ నిర్వహణ కోసం తమ రాజధాని సియోల్‌ ను దక్షిణ కొరియా వేదికగా ఎంచుకోగా.. ఉత్తర కొరియా ప్యాంగ్‌ యాంగ్‌ నగరాన్ని ప్రతిపాదిస్తోంది. రియో వేదికగా 2016లో జరిగిన ఒలింపిక్స్‌ లోనూ ఈ రెండు దేశాలు కలిసి ఆడాయి. గతేడాది దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌ యాంగ్‌ లో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌ కు ఉత్తర కొరియా తమ జట్లను పంపడంతో రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు మెరుగుపడ్డాయి. వింటర్ ఒలింపిక్స్‌లో ఇరు దేశాలు ఒకే జెండా కింద మార్చి ఫాస్ట్‌ కూడా చేశాయి. దక్షిణ కొరియాకు ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వహించిన అనుభవం ఉంది. 1988లో సియోల్‌లో ఒలింపిక్స్‌ జరిగాయి. అప్పట్లో ఉత్తర కొరియా - దక్షిణ కొరియాకు మధ్య సంబంధాలు ఏమీ బాగుండేవి కావు. అప్పుడు ఉత్తర కొరియా ఆ ఒలింపిక్స్‌ ను బహిష్కరించింది. అలాంటిది ఇప్పుడు దక్షిణ కొరియాతో కలిసి ఒలింపిక్స్ నిర్వహించడానికి ముందుకు రావడమంటే మామూలు విషయం కాదు. ఐతే తమ దేశంలోకి వేరే మీడియా కానీ - దౌత్య అధికారుల్ని కానీ అనుమతించకుండా, తమ సమాచారం ఏదీ బయటికి పోకుండా ఒక రహస్య దేశంలాగా కొనసాగుతున్న ఉత్తర కొరియా.. ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఈ నిబంధనలన్న సడలించాల్సిందే. అందుకు కిమ్ ఒప్పుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరం.