Begin typing your search above and press return to search.

జీఎస్టీ దేశాన్ని రెండుగా చీల్చేస్తుందా?

By:  Tupaki Desk   |   4 July 2017 5:30 PM GMT
జీఎస్టీ దేశాన్ని రెండుగా చీల్చేస్తుందా?
X
ఇప్పుడు ఎక్క‌డ చూసినా జీఎస్టీపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఒకే దేశం- ఒకే ప‌న్ను పేరిట న‌రేంద్ర మోదీ స‌ర్కారు మొన్న ప్రారంభించిన ఈ కొత్త ప‌న్ను విధానంతో ఏఏ వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గుతాయి? ఏఏ వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతాయి? అస‌లు ఈ ప‌న్నుతో మ‌న‌కు లాభ‌మెంత‌?, న‌ష్ట‌మెంత‌? అన్న కోణంలో అటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు ఇటు స‌గ‌టు జీవి కూడా ఒక‌టికి రెండు సార్లు బేరీజు వేసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో జీఎస్టీపై ఏ చిన్న వార్త వ‌చ్చినా కూడా అది వైర‌ల్‌ గానే మ‌రిపోతున్న ప‌రిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం. అస‌లు జీఎస్టీ వ‌ల్ల దేశానికి ఒన‌గూరే లాభ‌మెంత‌? అన్న విష‌యాన్ని కాస్తంత ప‌క్క‌న‌బెడితే... ఈ ప‌న్ను విధానం మెజారిటీ దేశాల్లో అస‌లు స‌క్సెస్ కాలేద‌ని కూడా కొంద‌రు ఆర్థిక వేత్త‌లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేత‌ - దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌యాంలో ప‌త్రాల‌పైకి వ‌చ్చిన ఈ కొత్త ప‌న్ను విధానాన్ని బీజేపీ నేత‌గా ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హ‌యాంలో ప‌ట్టాలెక్కించేశారు.

ఈ ప‌న్ను ప్ర‌వేశం ద్వారా ఎవ‌రెవ‌రికి లాభం?, ఎవ‌రెవ‌రికి న‌ష్ట‌మ‌న్న విష‌యంపై ఇప్ప‌టికీ భిన్న‌మైన వాద‌న‌లే వినిపిస్తున్నా... తాజాగా ఓ స‌రికొత్త‌గా తెరపైకి వ‌చ్చిన ఓ వాద‌న ఇప్పుడు దేశాన్ని నిజంగానే రెండుగా చీల్చేసింద‌నే చెప్పాలి. జీఎస్టీ వ‌ల్ల కేవ‌లం ఉత్త‌రాది రాష్ట్రాల‌కే లాభ‌మ‌ని, ద‌క్షిణాది రాష్ట్రాలు మాత్రం ఈ ప‌న్ను పోటికి విల‌విల్లాడాల్సిన దుస్థితి నెల‌కొంద‌న్న వాద‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. అయినా ఒకే దేశం- ఒకే ప‌న్ను అన్న‌ప్పుడు ఉత్త‌రాది వారికి లాభంగా ద‌క్షిణాది వారికి న‌ష్టంగా ఈ ప‌న్ను ఎలా ప‌రిణ‌మిస్తుంద‌న్న విష‌యాన్ని ఓ సారి ప‌రిశీలిస్తే... వ‌స్తువుల ఉత్ప‌త్తిలో ఉన్న వారిపైనే జీఎస్టీ ప‌న్ను ప‌డుతుంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. అదే స‌మ‌యంలో వినియోగ‌దారుడిపై ఈ ప‌న్ను ప్ర‌భావం అంత పెద్ద‌గా ఏమీ ఉండ‌ద‌ని, వ‌స్తువు ఉత్ప‌త్తి అయ్యేట‌ప్పుడే అన్ని ప‌న్నులు వ‌సూలు అవుతుండ‌గా, ఇక వినియోగ‌దారులు ఆ వ‌స్తువుకు ప‌న్ను క‌ట్టాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌న్న వాద‌న ముందు నుంచీ వినిపిస్తున్న‌దే.

మ‌రి ఉత్ప‌త్తిదారుడు, వినియోగ‌దారుడి మ‌ధ్య అంత‌రాన్ని పెంచే ఈ జీఎస్టీ ప‌న్ను కార‌ణంగా దేశం రెండుగా విడిపోతుంద‌న్న విష‌యాన్ని న‌మ్మొచ్చా? అన్న ప్ర‌శ్న ఇప్పుడు మ‌న మ‌దిని తొలుస్తుంది. దీనికి కూడా కొంద‌రు ఆర్థిక వేత్త‌లు ప‌క్కా ఉదాహ‌ర‌ణ‌లు చెప్పి మ‌రీ... జీఎస్టీ దేశాన్ని రెండుగా విభ‌జించ‌డం ఖాయమేన‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతున్నారు. అదెలాగంటే... దేశంలో జ‌రిగే మెజారిటీ ఉత్ప‌త్తి కార్య‌క్ర‌మాల‌న్నీ కూడా ద‌క్షిణాది రాష్ట్రాల కేంద్రంగానే జ‌రుగుతున్నాయ‌ట‌. అంటే ద‌క్షిణాది రాష్ట్రాలు దేశానికి ఉత్ప‌త్తి కేంద్రంగా ఉన్నాయ‌న్న మాట అదే స‌మ‌యంలో ఉత్త‌రాదిలో ఉత్ప‌త్తి లేక‌పోగా... ద‌క్షిణాదిలో త‌యార‌య్యే వ‌స్తువుల‌పైనే వారంతా ఆధార‌ప‌డ‌తార‌ట‌. ఈ క్ర‌మంలో ఉత్త‌రాది రాష్ట్రాల‌ను కొంద‌రు వినియోగ‌దారుల రాష్ట్రాలుగా పిలుస్తున్నారు. ఈ లెక్క‌న ఉత్ప‌త్తి రాష్ట్రాలుగా ఉన్న ద‌క్షిణాది రాష్ట్రాలపైనే జీఎస్టీ ప‌న్ను ప‌డుతుంద‌ని, వినియోగ‌దారుల రాష్ట్రాలుగా ఉన్న ఉత్త‌రాది రాష్ట్రాల‌పై అస‌లు ప‌న్ను పోటే ఉండ‌ద‌ని తెలుస్తోంది. ఇదే నిమైతే మాత్రం... జీఎస్టీ ప‌న్ను విధానం దేశాన్ని ఉత్త‌రాది, ద‌క్షిణాది రాష్ట్రాలుగా విడ‌గొట్ట‌డం ఖాయ‌మేన‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/