Begin typing your search above and press return to search.

వినాశ‌నం వైపు న‌డిపే వార్ ఈ రాత్రికే షురూ?

By:  Tupaki Desk   |   25 Aug 2017 4:54 AM GMT
వినాశ‌నం వైపు న‌డిపే వార్ ఈ రాత్రికే షురూ?
X
కొద్ది నెల‌ల క్రితం వ‌ర‌కూ మూడో ప్ర‌పంచ యుద్ధం గురించి.. అణ్వ‌స్త్ర దాడుల గురించి చింతించే ప‌రిస్థితి లేదు. కానీ.. కొన్ని వారాల నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఎప్పుడేం జ‌రుగుతుందో అన్న సందేహంతో పాటు.. చ‌డీచ‌ప్పుడు లేకుండా మూడో ప్ర‌పంచ యుద్ధం మీద‌కు వ‌చ్చి ప‌డినా ఆశ్చ‌ర్యం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

కొద్ది మంది వ్య‌క్తుల రాజ‌కీయ ప్ర‌యోజ‌నం.. ఇగోలు ప్ర‌పంచ చ‌రిత్ర‌ను దారుణ‌దిశ‌గా న‌డ‌ప‌నున్నాయా? అన్న సందేహం క‌లిగేలా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఉత్త‌ర‌కొరియా.. అమెరికాల మ‌ధ్య గ‌డిచిన కొద్ది కాలంగా సాగుతున్న మాటల యుద్ధం గురించి తెలిసిందే. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి.. ఉత్త‌ర కొరియా నియంత కిమ్ చేతికి వ‌చ్చిన అణ్వ‌స్త్రాల‌తో త‌ర‌చూ చెల‌రేగిపోతున్నాడు. అమెరికా మీద అణ్వ‌స్త్ర దాడి చేయాల‌న్న త‌న దుర్మార్గ క‌ల‌ను త‌ర‌చూ బ‌య‌ట‌పెడుతున్నాడు కిమ్‌. కొన్ని వారాలుగా అణ్వ‌స్త్ర దాడి మీద త‌ర‌చూ వ్యాఖ్య‌లు చేయ‌టం.. ప‌లుమార్లు ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌టం లాంటివి ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌ల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఉత్త‌ర‌కొరియా విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో అగ్ర‌రాజ్య‌మైన అమెరికా ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగా ఉత్త‌ర‌కొరియా ఏదైనా అనుకోని విధంగా నిర్ణ‌యం తీసుకుంటే.. దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా తిప్పి కొట్టేందుకు వీలుగా అమెరికా స‌న్నాహాలు చేసుకుంటోంది.

ఇటీవ‌ల ఉత్త‌ర కొరియాకు స‌మీపంలో ఉండే ద‌క్షిణ కొరియాతో క‌లిసి స‌ముద్ర జ‌లాల్లో అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల్ని నిర్వ‌హిస్తోంది. ఈ విన్యాసాల‌పై ఉత్త‌ర కొరియా తీవ్ర ఆగ్ర‌హంగా ఉంది. సైనిక విన్యాసాల నేప‌థ్యంలో అమెరికాపై చిన్న త‌రహా దాడి చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉత్త‌ర కొరియా ఉన్న‌ట్లుగా అమెరికా సైన్యం భావిస్తోంది.

తాజాగా నిర్వ‌హిస్తున్న సైనిక విన్యాసాల నేప‌థ్యంలో కొద్దిమంది సైనికాధికారుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌ర కొరియా కానీ మొద‌ట దాడికి దిగితే.. స‌మ‌ర్థ‌వంతంగా దాడిని ఎదుర్కొంటామ‌ని అమెరికా సైనికాధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అవ‌స‌ర‌మైతే త‌మ ద‌ళాల‌పై ఈ రాత్రికే ఉత్త‌ర కొరియా దాడి చేసేందుకు సైతం వెనుకాడ‌ద‌న్న భావ‌న‌ను అమెరికా సైన్యాధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఒక‌వేళ అలాంటిదే జ‌రిగితే ఉత్త‌ర‌కొరియాకు త‌గిన గుణ‌పాఠం చెప్పుందుకు వీలుగా అమెరికా సైన్యంసిద్ధ‌మ‌వుతోంది. తామే కాదు.. అటు ఉత్త‌ర కొరియా కూడా త‌మ ప‌న్నాగాల్లో నిమ‌గ్న‌మైంద‌ని ప‌లు మీడియా రిపోర్ట్స్ చెబుతున్నారు. దీంతో.. ఉరుము మెరుపు లేని జ‌డివాన‌లా ఉత్త‌ర కొరియా విరుచుకుప‌డితే.. దాన్ని బ‌లంగా తిప్పి కొట్ట‌టంతో పాటు.. అమెరికాతో పెట్టుకుంటే ప‌రిస్థితి ఎలాఉంటుంద‌న్న గుణ‌పాఠాన్ని ఉత్త‌ర‌కొరియాకు చేత‌ల్లో చేసి చూపించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో అమెరికా సైన్య‌మంతా ఉంద‌ని జ‌న‌ర‌ల్ విన్సెంట్ బ్రూక్స్ చెబుతున్నారు. తాజాగా చోసుకుంటున్న ప‌రిణామాల్ని చూస్తే.. ఏ నిమిషంలో అయినా అమెరికా - ఉత్త‌ర కొరియాల మ‌ధ్య వినాశ‌క‌ర యుద్ధం మొద‌ల‌వుతుందా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. కాలం మాత్ర‌మే ఈ ప్ర‌శ్న‌కు స‌రైన స‌మాధానం ల‌భిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.