Begin typing your search above and press return to search.

5 వారాలు... 4 క్షిపణి పరీక్షలు

By:  Tupaki Desk   |   8 Jun 2017 8:16 AM GMT
5 వారాలు... 4 క్షిపణి పరీక్షలు
X
మొండోడు రాజు కంటే బలవంతుడని అంటారు.. ఉత్తరకొరియా పద్ధతి అలానే ఉంది. అటు అగ్రరాజ్యం అమెరికానే కాదు యావత్ ప్ర‌పంచాన్నీ భయపెడుతున్న ఉత్తర కొరియా మరోమారు క్షిపణి పరీక్షలు నిర్వహించింది.

ఉత్తరకొరియా గురువారం ఉదయం ‘సర్ఫేస్ టు షిప్’ క్షిపణులను పరీక్షించినట్టు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వోన్సన్ - గ్యాంగ్‌ వోన్ ప్రావిన్స్ సమీపంలో ఈ పరీక్షలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇది ఉత్తరకొరియా గత ఐదు వారాల్లో నిర్వహించిన నాలుగో పరీక్ష.

ఐక్యరాజ్యసమితి ఆంక్షలను - అమెరికా బెదిరింపులను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా ఈ పరీక్షలు నిర్వహించింది. భూమిపై నుంచి సముద్రంలోని నౌకలను ధ్వంసం చేయగల సామర్థ్యమున్న వీటిని అమెరికా నౌకలే లక్ష్యంగా ప్రయోగించినట్లు తెలుస్తోంది. గతనెల మొదట్లో అమెరికా లక్ష్యంగా దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అక్కడి నుంచి వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూనే ఉంది. గతేడాది ప్రారంభం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కిమ్ ప్రభుత్వం రెండు అణుపరీక్షలు - డజన్ల కొద్దీ క్షిపణి పరీక్షలు నిర్వహించింది.

మరోవైపు ఉత్తరకొరియాను బెదిరించేందుకు అమెరికా ఇప్పటికే థాడ్ మిస్సైల్ వ్యవస్థను దక్షిణ కొరియాకు చేర్చింది. అంతేకాకుండా - కార్ల్ విన్సన్ - రొనాల్డ్ రీగన్ యుద్ధనౌకలను కూడా ఉత్తరకొరియా సమీప సముద్ర జలాల్లోకి పంపి లంగరేయించింది. కానీ అమెరికా చర్యకు ఉత్తరకొరియా ఏమాత్రం బెదరలేదు. ఇప్పుడు తాజాగా చేసిన ఈ పరీక్షలు చూస్తుంటే కయ్యానికి నేను రెడీ అంటున్నట్లే ఉంది. గురువారం ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణులు ఆ దేశానికి సుమారు 120 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/