Begin typing your search above and press return to search.
అమెరికా మొత్తాన్ని లేపేసే మిస్సైల్ టెస్ట్ సక్సెస్
By: Tupaki Desk | 29 July 2017 6:46 AM GMTఅగ్రరాజ్యం అమెరికా - దూకుడుగా ముందుకు సాగుతున్న ఉత్తర కొరియా మధ్య నెలకొన్న ప్రచ్చన్న యుద్ధంలో మరో పరిణామం తెరమీదకు వచ్చింది. అమెరికాకు తాజాగా ఉత్తరకొరియా మరో వార్నింగ్ ఇచ్చింది. తాము తాజాగా పరీక్షించిన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ అమెరికా మొత్తాన్ని కవర్ చేస్తుందని అక్కడి మీడియా వెల్లడించింది. ఇప్పుడు అమెరికా మొత్తం తమ లక్షిత ప్రాంతంలోకి వచ్చినట్లేనని, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంపైనైనా తమ దేశం నుంచే దాడి చేయగలమని విశ్లేషించింది.
శుక్రవారం నార్త్ కొరియా మరో బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష తర్వాత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ.. ఈ మిస్సైల్ టెస్ట్ తో ఎప్పుడైనా - ఎక్కడైనా మిస్సైల్ ను ప్రయోగించే సామర్థ్యం నార్త్ కొరియా సంపాదించిందని ప్రకటించారు. అంతేకాదు అమెరికాలో ఎక్కడి లక్ష్యాన్నైనా ఛేదించే సత్తా ఇప్పుడు తమకు ఉందని ఉన్ స్పష్టం చేసినట్లు అక్కడి మీడియా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు సమాధానంగా నార్త్ కొరియా ఈ మిస్సైల్స్ టెస్ట్‌లకు పాల్పడుతోంది. ఈ నెలలో ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష నిర్వహించడం ఇది రెండోసారి.
అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మిస్సైల్ పరీక్షను ఖండించారు. ఇది నిర్లక్ష్య - ప్రమాదకర చర్యగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి పరీక్షలతో ప్రపంచాన్ని హెచ్చరించామని భావిస్తున్న ఉత్తర కొరియా ఇప్పుడు ఒంటరైంది. వాళ్ల ఆర్థిక వ్యవస్థ బలహీనమైంది అని ట్రంప్ అన్నారు. తమ భూభాగాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుసని ఆయన స్పష్టంచేశారు. అటు జపాన్ కూడా నార్త్ కొరియా మిస్సైల్ టెస్ట్ లను ఖండించింది. ఈ తీరు ఉద్రిక్తతలకు బీజం వేస్తుందని పేర్కొంది.