Begin typing your search above and press return to search.

సరిగ్గా కూర్చోలేదని ఉపప్రధానిని ఉరి తీశారు!

By:  Tupaki Desk   |   1 Sep 2016 7:19 AM GMT
సరిగ్గా కూర్చోలేదని ఉపప్రధానిని ఉరి తీశారు!
X
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి చెప్పుకోవాలే కానీ.. చెప్పుకునే కొద్దీ అతడి పైశాచికత్వం - మితిమీరిన నియంతృత్వం కథలు కథలుగా చెప్పుకోవచ్చు. మూర్ఖత్వానికి - నియంతృత్వానికీ పరాకాష్టగా చెప్పుకునే ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడి పైశాచికత్వానికి రాను రానూ అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. తాజాగా తన అధికారంపై మరింత పట్టును పెంచుకోవడానికో లేక తన పైశాచికత్వాన్ని మరోసారి ప్రపంచానికి తెలపాలనో కానీ ఏకంగా ఉపప్రధానికి కూడా ఉరితీశాడట. అలా ఆ ఉపప్రధానేమీ దేశద్రోహానికి పాల్పడలేదు చేసింది చిన్న పొరపాటు మాత్రమే!!

విషయానికొస్తే... కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో ఉప ప్రధాని సరిగా కూర్చోలేదని ఆయనను ఉరితీసినట్లు దక్షిణకొరియా మీడియా వెల్లడించింది. గత జూలైలో ఉప ప్రధాని కిమ్‌ యాంగ్‌ జిన్‌ ను బహిరంగంగా ఉరితీయించారని తాజాగా పేర్కొంది. కిమ్‌ జోంగ్‌ ఉన్ అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన అసభ్యకరమైన రీతిలో కుర్చీలో కూర్చున్నారని, ఆ విషయం అధ్యక్షుడికి ఏమాత్రం నచ్చలేదని దాంతో వెంటనే అతడిని అరెస్ట్ చేసి విచారణకు ఆదేశించారని చెబుతున్నారు. అనంతరం ఆ ఉప ప్రధానిపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఒక కేసు, దేశంలో విప్లవాన్ని లేవదీస్తున్నాడనే అభియోగంతో మరోకేసు మోపీ మరణశిక్ష విధించారని దక్షిణకొరియా మీడియా ప్రకటించింది. ఇవే అభియోగాలతో మరో ఇద్దరు సీనియర్ అధికారులకు కూడా ఇలాంటి శిక్షనే అమలు చేశారని ఆ మీడియా తెలిపింది.

కాగా గతంలో కూడా దేశ ద్రోహానికి, అవినీతికి పాల్పడ్డాడనే నేరంపై తన మేనమామ జంగ్ సాంగ్ థీక్ కు కూడా మరణశిక్ష విధించాడు కిం జోంగ్ ఉన్. అయితే ఆ మరణ శిక్ష విషయంలో.. అతడి మేనమామకు వంటిపై నూలుపోగుకూడా లేకుండా చేసి, ఒక బోనులో బందించి ఆ బోనులోకి ఆకలితో ఉన్న 100కు పైగా కుక్కలను పంపి అత్యంత పాశవికంగా చంపించాడని 2014 లో చైనా పత్రిక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది