Begin typing your search above and press return to search.

రెచ్చిపోయిన కిమ్‌.. షాక్ లో ప్ర‌పంచ దేశాలు

By:  Tupaki Desk   |   26 Aug 2017 6:44 AM GMT
రెచ్చిపోయిన కిమ్‌.. షాక్ లో ప్ర‌పంచ దేశాలు
X
తాము చేసే ప‌ని మాన‌వాళికి న‌ష్టం వాటిల్లుతుంద‌ని తెలిసినా ప‌ట్టించుకోకుండా మూర్ఖంగా ముందుకెళ్లిన వారు చ‌రిత్ర‌లో చాలామందే క‌నిపిస్తారు. అలాంటి వారి కార‌ణంగా తాత్కాలికంగా కొంత న‌ష్టం వాటిల్లినా.. వారి ఆశ‌లేం నిజం కాలేద‌న్న‌ది తెలిసిందే. తాజాగా పిచ్చోడి చేతిలో రాయిలా ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు.. నియంత కిమ్ జోంగ్ ఉన్ ద‌గ్గ‌ర ఉన్న అణ్వ‌స్త్రాలు మారాయి. ఎప్పుడేం చేస్తారో తెలియ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న తీరు ప్ర‌పంచ దేశాల‌కు వ‌ణుకు పుట్టిస్తోంది.

ఇటీవ‌ల కాలంలో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌పంచానికే పెద్దన్న అయిన అమెరికాకు ఒళ్లు ముండేలా చేస్తున్నారు. ఈ రెండు దేశాల మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధం ఈ మ‌ధ్య‌న పీక్స్ కు వెళ్లి.. త‌ర్వాత కాస్త త‌గ్గ‌టంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

అయితే.. ఊహించ‌నిరీతిలో ఈ రోజు (శ‌నివారం) వ‌రుస క్షిప‌ణి ప్ర‌యోగాల‌తో ఆయ‌న ప్ర‌పంచ దేశాల‌కు బీపీ తెచ్చారు. కొద్ది టైం తేడాతో ఏకంగా మూడు క్షిప‌ణి ప‌రీక్ష‌ల్ని ఆయ‌న నిర్వ‌హించారు. ఉత్త‌ర కొరియా ప‌రీక్షించిన మూడు క్షిప‌ణులు జ‌పాన్ స‌ముద్ర జ‌లాల్లో ప‌డిపోయాయి. ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడి తీరుతో జ‌పాన్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తోంది.

అమెరికా.. ద‌క్షిణ కొరియా ద‌ళాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేయ‌టంపై ఉత్త‌ర‌కొరియా తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. త‌న క‌సి తీరేలా తాజా క్షిప‌ణి ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హించిన‌ట్లుగా చెబుతున్నారు. నెల క్రితం వ‌ర‌కూ అమెరికా.. ఉత్త‌ర కొరియాల మ‌ధ్య‌నున్న స‌వాళ్లు.. వారం కింద‌ట వ‌ర‌కూ సాగాయి. ఆ త‌ర్వాత రెండు దేశాలు కాస్త మెత్త‌బ‌డిన‌ట్లుగా క‌నిపించాయి. ఈ నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య యుద్ధ జ్వాల‌లు ఆరిన‌ట్లేన‌ని భావించారు. అయితే.. ఊహించ‌ని రీతిలో ఈ ఉద‌యం నుంచి ఉత్త‌రకొరియా వ‌రుస‌గా మూడు క్షిప‌ణి ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హించింది. ఇందులో రెండు టార్గెట్ ను రీచ్ కాక మ‌ధ్య‌లోనే ప‌డిపోయాయి. అయితే.. రెండోది మాత్రం కిమ్ అంచ‌నాల్ని వ‌మ్ము చేయ‌కుండా స‌క్సెస్ అయ్యింది. ఈ ప‌రీక్ష‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి. ఉత్త‌ర కొరియా చేసిన క్షిప‌ణ ప‌రీక్ష‌లన్నీ చిన్న శ్రేణి క్షిప‌ణులేన‌ని అమెరికాకు చెందిన ప‌సిఫిక్ క‌మాండ్ పేర్కొంది. చిన్నో.. పెద్దో కానీ త‌న ద‌గ్గ‌రున్న క్షిప‌ణుల‌తో ప్ర‌పంచ దేశాల‌కు వ‌ణుకు తెప్పిస్తున్న కిమ్ తీరు మ‌రోసారి సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.