Begin typing your search above and press return to search.

నియంత బ‌రితెగింపుతో ప్ర‌పంచ వినాశ‌న‌మేనా?

By:  Tupaki Desk   |   9 Aug 2017 7:18 AM GMT
నియంత బ‌రితెగింపుతో ప్ర‌పంచ వినాశ‌న‌మేనా?
X
ఒక మూర్ఖుడికి.. దుర్మార్గుడికి విశేష అధికారం చేతికి వ‌స్తే ప‌రిస్థితి ప్ర‌శాంతంగా ఉండాల్సిన ప్ర‌పంచం అత‌లాకుత‌లం అవుతుంది. ఈ మాట ఎంత నిజ‌మ‌న్న‌ది తాజాగా ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడి తీరు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అగ్ర‌రాజ్య‌మైన అమెరికాతో ఎప్పుడు పేచీ పెట్టుకుందామా? ఆ దేశం మీద ఎప్పుడు అణుదాడి చేద్దామ‌న్న దుర్మార్గ ఆలోచ‌న‌లు చేసే కిమ్ జాంగ్ వున్ తీరుతో ప్ర‌పంచ మార్కెట్లు ఇప్పుడు హ‌డ‌లిపోతున్నాయి. తాజాగా ఉత్త‌ర కొరియా అధికారిక మీడియా చేసిన హెచ్చ‌రిక‌తో ఎప్పుడేం జ‌రుగుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఉత్త‌ర‌కొరియా క్షిప‌ణి ప్ర‌యోగాల‌ను ఉపేక్షించేది లేద‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో.. ఉత్త‌ర కొరియా మ‌రింత రెచ్చిపోయింది. అమెరికా స‌మీపంలో అణుదాడి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు హెచ్చ‌రిక‌లు చేసింది. ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలోని అమెరికాకు చెందిన ద్వీపం గువామ్ లో అణుదాడి చేస్తామ‌ని కొరియా వార్నింగ్ ఇచ్చింది. గువామ్‌ పై మ‌ధ్యంత‌ర బాలిస్టిక్ క్షిప‌ణి హ్వాసంగ్ 12ను ప్ర‌యోగించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లుగా ఉత్త‌ర‌కొరియా మీడియా కొరియ‌న్ సెంట్ర‌ల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

అణుదాడికి సంబంధించి ప్ర‌ణాళిక‌లు తుదిద‌శ‌కు వ‌చ్చాయ‌ని.. త‌మ అధ్య‌క్షుడు ఏ క్ష‌ణంలో అయినా అణుదాడికి అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌న్న మాట ఇప్పుడు ప్ర‌పంచ దేశాల్ని వ‌ణికిస్తోంది. ఒక‌వేళ‌.. త‌మ అణుదాడిని అడ్డుకుంటే అమెరికాలోని ముఖ్య‌న‌గ‌రంపై తాము దాడి చేస్తామ‌న్న మాట కొత్త త‌ర‌హా మంట‌ల్ని పుట్టిస్తున్నాయి. బాధ్య‌త లేని రీతిలో బ‌రితెగిస్తున్న కిమ్ జాంగ్ పుణ్య‌మా అని ప్ర‌పంచం వినాశ‌నం దిశ‌గా అడుగులు ప‌డ‌తాయా? అన్న భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఉత్త‌ర‌కొరియా మాట‌ల‌తో అమెరికా అప్ర‌మ‌త్త‌మైంది. ఫ‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలోని గువాం ద్వీపం మీదుగా అమెరికా యుద్ధ విమానాలు దూసుకెళ్లాయి. అత్య‌వ‌స‌రంగా ఏర్పాటు చేసిన స‌మావేశం అనంత‌రం దాదాపు ప‌ది గంట‌ల పాటు అమెరికాకు చెందిన సూప‌ర్ సోనిక్ బాంబ‌ర్ జెట్లు గువాం మీదుగా ప‌లుమార్లు గాల్లో చ‌క్క‌ర్లు కొట్టాయి.

ఉత్త‌ర‌కొరియా పేర్కొన్న‌ట్లుగా అణుదాడి జ‌రిపేందుకు సిద్ధ‌మైతే.. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఉత్త‌ర‌కొరియా తీరుపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌పంచంలో ఎప్పుడూ చూడ‌ని విధంగా అమెరికా విశ్వ‌రూపాన్ని ఉత్త‌ర‌కొరియా చూడాల్సి వ‌స్తోంద‌ని హెచ్చ‌రించ‌టం తెలిసిందే. పోటాపోటీగా చేసుకుంటున్న వ్యాఖ్య‌లు.. ఏర్పాట్ల ప్ర‌భావం ప్ర‌పంచం మీద ఎలా ప‌డ‌తాయ‌న్న‌ది ఇప్పుడో పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.