Begin typing your search above and press return to search.

అమెరికాపై దాడికి ఉత్త‌ర కొరియా రెడీ?

By:  Tupaki Desk   |   10 Aug 2017 4:22 PM GMT
అమెరికాపై దాడికి ఉత్త‌ర కొరియా రెడీ?
X
ప్ర‌పంచ దేశాల‌కు పెద్ద‌న్న వంటి అగ్ర‌రాజ్యం అమెరికాను చిన్న దేశ‌మైన ఉత్త‌ర‌కొరియా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. అంత‌ర్జాతీయంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ వ‌రుస‌గా క్షిప‌ణి ప్ర‌యోగాలు చేస్తూ అమెరికాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. చాప‌కింద నీరులా త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. అగ్రరాజ్యం అమెరికాను ఉత్తరకొరియా ఏమీ చేయ‌లేద‌న్న భావ‌న‌లో ఉన్న ఆ దేశాధ్య‌క్షుడు ట్రంప్ కు దిమ్మ‌దిరిగేలా షాక్ ఇచ్చేంద‌కు స‌న్నాహాలు చేస్తోంది. అమెరికాపై దాడి చేసేందుకు ర‌హ‌స్యంగా వ్యూహ ర‌చ‌న చేస్తోంది.

అమెరికా - ఉత్త‌ర కొరియా మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో....ప‌సిఫిక్ స‌ముద్రంలో ఉన్న‌ అమెరికా దీవి గువామ్ ను ఉత్త‌ర కొరియా టార్గెట్ చేసుకొని త‌న స్టామినా నిరూపించాల‌ని ఆలోచిస్తోంది. గువామ్ పై నాలుగు హాసంగ్‌-12 క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించి అమెరికాకు షాక్ ఇవ్వాల‌ని ఉత్త‌ర కొరియా యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జ‌పాన్ స‌ముద్ర జ‌లాల మీదుగా ఆ క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. మ‌రో వారం రోజుల్లోగా తుది ప్ర‌ణాళిక సిద్ధం చేసి, దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆమోదం తీసుకొని మిలిట‌రీ దాడికి దిగాల‌ని ఉత్త‌ర కొరియా యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గువామ్ దీవిపై ప్ర‌యోగించాల‌నుకున్న హాసంగ్‌-12 మిస్సైళ్లకు నిజంగా అంతటి శక్తి లేద‌ని, ఒక‌వేళ‌ ప్రయోగించినా అవి గువామ్ దీవికి 30 నుంచి 40 కిలోమీట‌ర్ల దూరంలో స‌ముద్ర జ‌లాల్లో ప‌డతాయ‌ని అమెరికా అంచ‌నా. ఉత్త‌ర కొరియా నుంచి గువామ్ దీవి సుమారు 3400 కిలోమీట‌ర్లు ఉండ‌డంతో ఈ సందేహం మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. మ‌రోవైపు హాసంగ్ క్షిప‌ణి సుమారు 3700 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌గ‌ల‌దని ఉత్తరకొరియా మిలిటరీ చెబుతోంది. ఉత్తరకొరియాకు అంత సీన్ లేద‌ని డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి కిమ్ నిజంగానే క్షిప‌ణుల‌ను ప్ర‌యోగిస్తే ట్రంప్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంది, కిమ్ దూకుడుకు ట్రంప్ ఎలా చెక్ పెడ‌తారు అన్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.