Begin typing your search above and press return to search.

అమెరికాకు కిమ్ హైడ్రోజన్ బాంబు గురిపెట్టారే!

By:  Tupaki Desk   |   3 Sep 2017 9:44 AM GMT
అమెరికాకు కిమ్  హైడ్రోజన్ బాంబు గురిపెట్టారే!
X
కొంతకాలంగా మాటలతో మంటలు పుట్టిస్తున్న‌ ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ రూటు మార్చారు. ఇటీవలే అమెరికా ఆధీనంలోని ఫసిఫిక్ మహా సముద్రంలోని గ్వామా దీవి లక్ష్యంగా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా కూడా క్షిపణి ప్రయోగించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరగుతుందోనని ఉత్తర కొరియా ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే అగ్రరాజ్యం హెచ్చరించినా కిమ్ జాంగ్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అమెరికా నెత్తిన హైడ్రోజన్ బాంబు వేసేందుకు కిమ్ సిద్ధమవుతుండటం కలకలం రేపుతోంది. ఉత్తర కొరియా ఆదివారం మరో అణు పరీక్షను నిర్వహించినట్లు ప్రకటించింది.

అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పరిశీలించినట్లు ఉత్తరకొరియా మీడియా పేర్కొన్న కొద్ది గంటల్లోపే అణు పరీక్ష జరిగింది. ఆ దేశ ఈశాన్య ప్రాంతం సున్‌ గ్జిబేగమ్‌ లో 6.3 తీవ్రతతో పేలుడు సంభవించినట్లు పేర్కొంది. దీంతో ఉత్తరకొరియాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని తెలిపింది. రిపోర్టులు నిజమైతే ఉత్తరకొరియాకు ఇది ఆరో అణు పరీక్ష. ఉత్తరకొరియా ఇప్పటివరకూ నిర్వహించిన అణు పరీక్షల్లో ఇదే అత్యంత శక్తిమంతమైనది.

మరోవైపు.. అభివృద్ధి చేసిన హైడ్రోజన్‌ బాంబును - జులైలో ప్రయోగించి ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం) హస్వాంగ్‌-14కి అమర్చేందుకు అనువుగా తయారు చేసినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ బాంబుతో అణు క్షిపణి అమెరికాను చేరుకోగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైడ్రోజన్‌ బాంబు వినియోగానికి అనుకూలంగా చేపట్టే ప్రయోగాలకు కిమ్‌ జాంగ్‌ ఎప్పుడో ఆదేశాలు జారీ చేశారని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. అభివృద్ధి చేసిన హైడ్రోజన్‌ బాంబును 10 కిలో టన్నుల నుంచి 100 కిలో టన్నుల వరకూ ఎంత మోతాదులో కావాలంటే అంత మోతాదులో ప్రయోగించొచ్చని తెలిపింది. మిగిలిన బాంబులతో పోల్చితే అత్యధిక ఎత్తులో ఈ బాంబును పేల్చొచ్చని చెప్పింది. దీని ద్వారా జరిగే వినాశనం కనీవినీ ఎరుగుని రీతిలో ఉంటుందని పేర్కొంది.

ఉత్తరకొరియా చర్యలతో అమెరికా - జపాన్‌ - దక్షిణ కొరియాలతో కొద్ది నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పటివరకూ ఐదు సార్లు అణుపరీక్ష జరిపింది. ఉత్తరకొరియా అణు పరీక్ష నిర్వహించడంపై జపాన్‌, దక్షిణ కొరియాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతేడాది రెండు సార్లు అణు పరీక్షలను నిర్వహించిన ఉత్తర కొరియా ఇటీవల వరుసగా క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తూ ఇరుగు పొరుగు దేశాలకు కొరకరాని కొయ్యలా తయారైంది.