Begin typing your search above and press return to search.

ట్రంప్‌ తో భేటీ విఫలమైనందుకు అయిదుగురు ఉత్తర కొరియా అధికారులకు మరణశిక్ష

By:  Tupaki Desk   |   1 Jun 2019 5:44 AM GMT
ట్రంప్‌ తో భేటీ విఫలమైనందుకు అయిదుగురు ఉత్తర కొరియా అధికారులకు మరణశిక్ష
X
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఎంత కఠినంగా ఉంటారో అక్కడి ప్రజలకు స్వయంగా తెలిస్తే.. మిగతా ప్రపంచానికి కూడా ఆయన చర్యల ద్వారా ఎంతో కొంత తెలుసు. ఆయన నిరంకుశత్వానికి ఉదాహరణగా నిలిచే మరో ఘటన ఆ దేశంలో జరిగింది. అమెరికా అధ్యక్షుడితో ఢీ అంటే ఢీ అనే కిమ్ ఆ విషయంలోనే తన ప్రభుత్వంలోని అయిదుగురు అధికారులకు మరణ శిక్ష విధించారని దక్షిణ కొరియా మీడియా చెబుతోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మధ్య రెండో సమావేశం అర్ధంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌ తో భేటీ విఫలమవడానికి కారణంగా భావించి ఐదుగురు ఉన్నతాధికారులను ఉత్తరకొరియా ప్రభుత్వం కాల్చి చంపిందట. దక్షిణకొరియాకు చెందిన వార్తాపత్రిక ది చూసన్‌ ఇల్బో ఈ సంగతి బయటపెట్టింది. అణ్వస్త్ర నిరోధక చర్యల కోసం ట్రంప్‌ తో ఓ విడత భేటీ అయిన కిమ్ ఆ తరువాత రెండో విడత చర్చలు కూడా ప్రారంభించారు. కానీ, అవి అర్ధాంతరంగా ముగిశాయి. అర్ధాంతరంగా ముగిసిన ఆ సమావేశానికి గ్రౌండ్‌ వర్క్‌ చేసిన అమెరికాకు ఉత్తరకొరియా ప్రత్యేక రాయబారి కిమ్‌ హ్యోక్‌ చోల్‌ ను ఈ ఏడాది మార్చిలో మిరిమ్‌ ఎయిర్‌ పోర్టులో ఫైరింగ్‌ స్క్వాడ్‌ కాల్చి చంపిందట. ఆయనతో పాటు విదేశాంగ శాఖకు చెందిన నలుగురు సీనియర్‌ అధికారుల ప్రాణాలు తీసేసినట్లు ఆ పత్రిక తెలిపింది. దేశాధినేతను మోసం చేశారన్న అభియోగాలతో వారికి మరణ శిక్ష విధించారట.

వీరే కాకుండా ట్రంప్‌ తో భేటీలో పొరబాట్లు చేసినందుకు గానూ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అనువాదకురాలు షిన్‌ హే యాంగ్‌ను జైలుకు పంపించినట్లు ఆ పత్రిక తెలిపింది. భేటీలో కిమ్‌ కొత్త ప్రతిపాదనలు అనువదించలేకపోయినందుకు గానూ ఆమెకు జైలు శిక్ష విధించినట్లు పేర్కొంది. అయితే దీనిపై అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సాధారణంగా ఉత్తరకొరియాలో జరిగే సంఘటనలు బయటి ప్రపంచానికి అరుదుగా తెలుస్తుంటాయి. అవి కూడా దక్షిణ కొరియా మీడియా నుంచే బయటకు వస్తాయి. అయితే, ఉత్తర కొరియాను తీవ్రంగా వ్యతిరేకించే దక్షిణ కొరియా ప్రభుత్వం, మీడియా కూడా ఉ.కొరియా విషయంలో అప్పుడప్పుడు అసత్యాలు ప్రచారం చేస్తారన్న ఆరోపణలూ ఉన్నాయి.