Begin typing your search above and press return to search.

కిమ్ రాజ్యంలో అంతే.. గడ్డ కట్టే చలిలో అరగంట స్పీచ్ తో నరకం

By:  Tupaki Desk   |   20 Feb 2022 5:50 AM GMT
కిమ్ రాజ్యంలో అంతే.. గడ్డ కట్టే చలిలో అరగంట స్పీచ్ తో నరకం
X
క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే పాలకుల్లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఒకరు. ప్రపంచంలో ఇలాంటి క్రూర పాలకులు ఉన్నప్పటికీ.. కిమ్ రూటు కాస్త సపరేటు. ఆయన వేసే వేషాలు.. చేసే చేష్టలు.. తీసుకునే నిర్ణయాలు సామాన్యుల నుంచి అందరిని తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాడు.

ఆయనకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి తరచూ మాట్లాడుకునేలా చేస్తుంది. తాజాగా అలాంటి పనే చేసి మరోసారి ప్రపంచం మొత్తం నివ్వెర పోయేలా చేసింది.

కిమ్ జోంగ్ ఉన్ తండ్రి 80వ జయంతి తాజాగా నిర్వహించారు. ఇందులో భాగంగా సంజియోన్ నగరంలో గడ్డ కట్టే చలిలో.. ప్రజలు వణికే పరిస్థితుల్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి వేలాది మంది హాజరవ్వాల్సిందే. వణికించే చలిలో బ్లౌజులు.. టోపీలు ధరించకుండానే క్రమశిక్షణతో నిలబడి.. కిమ్ ప్రసంగాన్ని బుద్దిగా వినాల్సిందే. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయో తెలిసిందే.

ఇదే తరహాలో 2019లో కూడా గడ్డ కట్టే చలిలో ప్రోగ్రాంలు నిర్వహించటం.. ప్రజలకు ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో తెలిసేలా చేయటం ఆయనకు అలవాటు.

అయితే.. కిమ్ దురాగత పబ్లిక్ మీటింగ్ కు సంబంధించి మరో వాదన వినిపిస్తోంది. సదరు మీటింగ్ లో భారీ ఎత్తున హీటర్లు వాడారని.. ప్రజలను ఇబ్బంది పెట్టలేదని చెబుతున్నారు. కావాలంటే ఈ సభకు సంబంధించిన ఫోటోల్లో కుప్పలుగా పడి ఉన్న వైర్లు.. హీటర్లకు సంబంధించేనని చెబుతున్నారు.

గడ్డ కట్టేట్లుగా ఉన్న వాతావరణంలో ఎన్ని హీటర్లు పెడితే మాత్రం ఏం లాభం.. వణికే వణుకుడు మామూలుగా ఉండదని.. అలాంటి వేళ.. తన తండ్రి గొప్పతనం గురించి.. ఆయనే ఘన చరిత్ర గురించి దాదాపు అరగంట పాటు ప్రసంగం సాగిందని చెబుతున్నారు.

ప్రతి ఏడాది తన తండ్రి జన్మదినోత్సవాన్ని దేశ ప్రజలంతా జరుపుకోవాలనుకోవటం బాగానే ఉన్నా.. అందులో భాగంగా ఇలా హింసించి మరీ తన తండ్రి గొప్పల గురించి ప్రచారం చేసుకోవటం చూస్తే.. కిమ్ దురాగతం ఏ రేంజ్ లోఉందో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.