Begin typing your search above and press return to search.

ఉత్త‌ర‌కొరియాపై యుద్ధానికి అమెరికా సిద్ధం

By:  Tupaki Desk   |   14 April 2017 1:41 PM GMT
ఉత్త‌ర‌కొరియాపై యుద్ధానికి అమెరికా సిద్ధం
X
దూకుడుగా ముందుకు సాగుతున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో దేశంపై దాడికి సిద్ధ‌మ‌య్యారా? ట్రంప్ ఎత్తుగ‌డ‌నే ప‌సిగ‌ట్టిన కొరియ నియంత కిమ్ జోంగ్ ఉన్ త‌న సైన్యాన్ని స‌ర్వ‌స‌న్న‌ద్ధం చేశారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఏప్రిల్ 15న‌ తన తాత - ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ 105వ జయంతి సందర్భంగా రాజధాని ప్యాంగ్‌ యాంగ్‌ లో సైనిక కవాతు జరుగుతుందని కిమ్ ప్ర‌క‌టించారు. అయితే ఇదే రోజు అణ్వ‌స్త్ర ప‌రీక్ష కూడా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

కాగా, త‌న కిమ్ ఇల్ సంగ్ జ‌యంతి సంద‌ర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ తన అణ్వస్త్ర లేదా క్షిపణి సామర్థ్యాలను ఇలాంటి వార్షికోత్సవాల సమయంలో ప్రదర్శించడం ఉత్తర కొరియాకు ప‌రిపాటి. అయితే ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఉత్కంఠ వాతావ‌ర‌ణం నెల‌కొంది. జయంతి సందర్భంగా భారీ మిలిటరీ డ్రిల్ నిర్వహిస్తే పర్వాలేదని... అణ్వస్త్ర పరీక్ష నిర్వహిస్తే మాత్రం సిరియాపై దాడి చేసినట్టుగానే, ఉత్తరకొరియాపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ సలహాదారు ఒకరు వెల్లడించిన నేపథ్యంలో ఇరు దేశాల నడుమ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదిలాఉండ‌గా కిమ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. భవిష్యత్తులో ఉత్తరకొరియా-దక్షిణకొరియా ఏకమవుతాయని జోస్యం చెప్తూ... ఆ దేశానికి కూడా తానే అధ్యక్షుడిని అవుతానని కిమ్ చెప్పారు. ఈ కామెంట్ల ద్వారా త్వరలోనే ఆయన పొరుగున ఉన్న‌ దక్షిణ కొరియాపై దాడి చేయవచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.

కాగా, ఉత్తరకొరియా అణు కార్యక్రమాలను నిలిపివేయించేందుకు ఒత్తిడి పెంచే క్రమంలో భాగంగా అమెరికా నావికాదళాలు ఆ దేశ ప్రాదేశిక జలాల్లోకి వచ్చాయి. ఈ చర్యలు ఉత్తరకొరియాను ఆక్రమించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు తీవ్రస్థాయికి చేరాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తమ ప్రాదేశిక జలాల్లోకి అమెరికా నావికాదళం చొచ్చుకురావడంపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాతో యుద్ధానికి సిద్ధమని హెచ్చరించింది. ఏ తరహా యుద్ధనైనా ఎదుర్కోవడానికి ఉత్తరకొరియా సిద్ధంగా ఉంద‌ని ఉత్తరకొరియా విదేశాంగశాఖ మంత్రి పేర్కొన్నట్టుగా ఆ దేశ జాతీయ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో, ఉత్తరకొరియా అణ్వస్త పరీక్ష నిర్వహిస్తుందా? ఆ దేశంపై అమెరికా దాడి చేస్తుందా? అనే ఉత్కంఠ అంత‌ర్జాతీయంగా చోటుచేసుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/