Begin typing your search above and press return to search.

గాలి బుడగలపై ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కొట్లాట

By:  Tupaki Desk   |   22 Jun 2020 11:50 AM GMT
గాలి బుడగలపై ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కొట్లాట
X
ఎప్పుడు యుద్ధం.. సైనిక చర్యలతో సరిహద్దు దేశంతో పాటు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసే దేశం ఉత్తర కొరియా. ఈ తీరును నిరసిస్తూ దక్షిణ కొరియా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గాలి బుడగలతో ఉత్తర కొరియాపై నిరసన తెలిపారు. ఇది తీవ్రంగా పరిగణించిన ఉత్తర కొరియా ప్రతీకార చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య చర్చలకు వేదికైన అనుసంధాన భవనాన్ని ఉత్తర కొరియా పేల్చివేసింది. దీంతో పాటు స్ర్టాంగ్ కౌంటర్లు ఇస్తోంది.

తమ దేశం గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్న దక్షిణ కొరియాకు కౌంటర్‌ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యామని ఉత్తర కొరియా తెలిపింది. ఇందుకోసం వేలాది గాలిబుడగలు, లక్షలాది కరపత్రాలను సిద్ధం చేసినట్లు సోమవారం వెల్లడించింది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ విధానాలను నిరసిస్తూ దక్షిణ కొరియాకు చెందిన మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు గాలి బుడగల్లో కరపత్రాలు నింపి సరిహద్దుల్లో వదిలిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియాలో ప్రజలకు ఎలాంటి హక్కులు లేవని.. అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతుందని కరపత్రాల్లో రాసి ఆందోళన తెలిపారు. దీనిపై కిమ్‌ సోదరి కిమ్‌ యో జాంగ్‌ స్పందించారు. మీ దేశ ప్రజలను కట్టడి చేయకుంటే మీపై సైనిక చర్యకు సిద్ధమవుతామని దక్షిణ కొరియాకు హెచ్చరించారు. శత్రుదేశానికి బుద్ధి చెప్పి తీరుతామని స్పష్టం చేశారు.

దక్షిణ కొరియా చర్యపై ఉత్తర కొరియా భగ్గమంటోంది. యాంటీ- సౌత్‌ లీఫ్లెట్‌ క్యాంపెయిన్‌ కు ఉత్తర కొరియా తెర తీసింది. వారి మాదిరే మూడువేలకు పైగా బెలూన్లు, దాదాపు కోటి కరపత్రాలు దక్షిణ కొరియాలో వెదజల్లేందుకు సిద్ధమైనట్లు సోమవారం అధికార మీడియా వేదికగా వెల్లడించింది. ఇలాంటి చర్యలు ఎంత చిరాకు తెప్పిస్తాయో, బాధను కలిగిస్తాయో ఇప్పుడు వారికి (దక్షిణ కొరియా)కు బాగా అర్థమవుతుందని పేర్కొంది. చేసిన తప్పుకు దక్షిణ కొరియా శిక్ష అనుభవించక తప్పదని.. అన్ని విధాలా సిద్ధంగా ఉండాలంటూ ఉత్తర కొరియా హెచ్చరించింది.