Begin typing your search above and press return to search.

అమెరికాను ట‌చ్ చేసే బాంబు త‌యారు చేశార‌ట‌

By:  Tupaki Desk   |   15 May 2017 8:43 AM GMT
అమెరికాను ట‌చ్ చేసే బాంబు త‌యారు చేశార‌ట‌
X
ప్రపంచ శాంతిని ప‌ణంగా పెట్టేలా ఉత్త‌ర‌కొరియా వ్య‌వ‌హారం మ‌రింత‌గా ముదిరింది. ప్ర‌పంచానికి పెద్ద‌న్న లాంటి అమెరికాను అణుబాంబుతో భ‌స్మీప‌టలం చేస్తామంటూ ఉత్తర కొరియా రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం తెలిసిందే. కేవ‌లం మాట‌లే కాదు.. చేత‌ల్లోనూ త‌మ స‌త్తాను చాటేలా తాజాగా ఇంట‌ర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించింది. ఈ ప్ర‌యోగంపై ఉత్త‌ర‌కొరియా తాజాగా స్పందిస్తూ.. ప‌రీక్ష విజ‌య‌వంతం అయ్యింద‌ని.. ఈ ప్ర‌యోగం స‌క్సెస్ కావ‌టంతో అమెరికాను టార్గెట్ చేసే క్షిప‌ణి వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

త్వ‌ర‌లోనే అణువార్ హెడ్‌ను మోసుకొని.. అమెరికా భూభాగాన్ని చేరుకునే సామ‌ర్థ్యం ఉన్న క్షిప‌ణిని త‌యారు చేస్తామ‌ని ప్ర‌క‌టించటం సంచ‌ల‌నంగా మారింది. ఆదివారం ఆ దేశం నిర్వ‌హించిన ప్ర‌యోగంలో 2 వేల కిలోమీట‌ర్ల ఎత్తులో 800 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించిన క్షిప‌ణి జ‌పాన్ స‌ముద్ర జ‌లాల్లో కూలిపోయింది. ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడిగా మూన్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ త‌ర్వాత ఉత్త‌ర‌కొరియా చేప‌ట్టిన మొద‌టి క్షిప‌ణి ప‌రీక్ష‌గా దీన్ని చెప్పాలి.

ఉత్త‌ర కొరియా ప్ర‌యోగించిన ఇంట‌ర్మీడియెట్ రేంజ్ మిస్సైల్ రానున్న రోజుల్లో ఖండాంత‌ర క్షిప‌ణి ప్ర‌యోగంగా మారుతుంద‌న్న అభిప్రాయాన్ని అమెరికా శాస్త్ర‌వేత్త‌లు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో ఉత్త‌ర‌కొరియా జ‌రిపిన ప్ర‌యోగంతో పోలిస్తే.. తాజా ప్ర‌యోగం మెరుగైంద‌న్న మాట‌ను చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాది లోపే ఉత్త‌ర‌కొరియా ఖండాంత‌ర క్షిప‌ణిని ప్ర‌యోగించే స్థాయికి చేరుకునే అవ‌కాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజా ప్ర‌యోగంపై జ‌పాన్, అమెరికా, ద‌క్షిణ కొరియాలు తీవ్రంగా ఖండించాయి. అయితే.. ఈ ఖండ‌న‌లు ఉత్త‌ర‌కొరియాను అస్స‌లు క‌ద‌లించ‌లేదు. క్షిప‌ణి ప‌రీక్ష‌లు విజ‌య‌వంతం కావ‌టంపై ఆ దేశంలో ఇప్పుడు సంబ‌రాలు జ‌రుపుకుంటుండ‌టం గ‌మ‌నార్హం.