Begin typing your search above and press return to search.

కొత్తరకం అణ్వాయుధాన్ని పరీక్షించిన ఉత్తరకొరియా

By:  Tupaki Desk   |   18 April 2022 11:30 PM GMT
కొత్తరకం అణ్వాయుధాన్ని పరీక్షించిన ఉత్తరకొరియా
X
అమెరికా సహా పాశ్చాత్య దేశాల వెన్నులో వణుకుపుట్టేలా ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ వ్యవహరిస్తున్నారు. కొత్త గైడెడ్ ఆయుధ వ్యవస్థను పరీక్షించినట్లు ఆ దేశ మీడియా ఆదివారం తెలిపింది. న్యూ టైప్ టాక్టికల్ గైడెడ్ వెపన్ ఫ్రంట్ లైన్ లాంగ్ రేంజ్ ఫిరంగి యూనిట్ల ఫైర్ పవర్ ను మెరుగుపరచడంలో వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంపొందించడంలో చాలా ముఖ్యమైనదంటూ అక్కడి అధికారిక మీడియా నివేదించింది.

తాజాగా చేసిన ఈ పరీక్ష విజయవంతమైనట్లు ప్రకటించింది. అయితే అది ఎప్పుడు ? ఎక్కడ జరిగిందో నివేదికలో వెల్లడించలేదు. 2017 తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పేల్చడంతోపాటు ఈ ఏడాది ఉత్తర కొరియా నిర్వహించిన ఆయుధపరీక్షల శ్రేణిలో ఈ ప్రయోగం సరికొత్తదిగా నిలుస్తోంది.

కాగా ఉత్తరకొరియాకు పోటీగా అమెరికా, దక్షిణ కొరియాతో కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టాయి. విన్యాసాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తర కొరియాకు చికాకు తీసుకురావడంతో ఈ చర్యలకు దిగిందని తెలుస్తోంది.

వారాంతంలో నార్త్ కొరియా పరీక్షించిన ఆయుధం కొత్త స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా కనిపించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆయుధ పరీక్షల సమయంలో అక్కడే ఉండి వీక్షించినట్లు తెలుస్తోంది. కిమ్ తన సైనిక పరిశోధన బృందానికి ముఖ్యమైన సూచనలు చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

ఇక పుంగ్గే-రి అణు పరీక్షా స్థలంలో టన్నెల్ వద్ద కొత్త అణు కార్యకలాపాలకు సంబంధించిన తాజా శాటిలైట్ చిత్రాలు ధృవీకరిస్తున్నాయి. వరుస క్షిపణి పరీక్షలకు ఇదే కేంద్రమని అంటున్నారు.