Begin typing your search above and press return to search.

పెద్ద‌న్న ఒక్క అడుగేసినా బూడిద కుప్పేన‌ట‌

By:  Tupaki Desk   |   11 May 2017 3:18 AM GMT
పెద్ద‌న్న ఒక్క అడుగేసినా బూడిద కుప్పేన‌ట‌
X
మాట‌లు హ‌ద్దులు దాటుతున్నాయి. పెద్ద‌న్న ఇగోను ట‌చ్ చేసే మాట‌ల్ని ఉత్త‌ర‌ కొరియా చేస్తుండ‌టంతో.. ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో అర్థం కానిదిగా మారింది. మూర్ఖుడు రాజు కంటే బ‌ల‌మంతుడ‌నే సామెతె కిమి్ విష‌యంలో కాస్త మార్చుకోవాల్సిందే. మూర్ఖుడే రాజు అయితే.. అన్న మాట వ‌చ్చేలా అత‌డి వ్య‌వ‌హారం ఉంటుంది. వెనుకా ముందు చూసుకోకుండా.. స‌మ‌రానికి సై అనేలా అత‌గాడి మాట‌లు పెద్ద‌న్న‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని క‌లిగేలా చేశాయి. అయితే.. పిచ్చాడి చేతిలో రాయిలా మారిన అణ్వ‌స్త్రాల‌తో.. అమెరికా సైతం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. సాధార‌ణంగా మాట‌కు మాట అనేసే తెంప‌రి ట్రంప్ సైతం.. ఉత్త‌ర‌ కొరియా విష‌యంలో త‌న బాడీ లాంగ్వేజ్‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మొద‌ట్లో కిమ్ విష‌యంలో క‌టువుగానే స‌మాధానం చెప్పిన ట్రంప్‌.. త‌ర్వాతి కాలంలో మాత్రం ఆచితూచి మాట్లాడ‌టం తెలిసిందే. ఒక ద‌శ‌లో ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల ద్వారా ఇష్యూల‌ను క్లోజ్ చేసుకోవాల‌న్న మాట‌ను అమెరికా చెప్పింది. అయిన‌ప్ప‌టికీ.. కిమ్ స‌ర్కారు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉండ‌టంతో చ‌ర్చ‌ల స్థానే మాట‌లు తూటాల్లా పేలుతున్నాయి. తాజాగా యూకేలో ఉత్త‌ర కొరియా బ్రాండ్ అంబాసిడ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.
కొరియా జ‌లాల్లోకి ప్ర‌వేశించిన అమెరికా బ‌ల‌గాలు.. ఇక‌పై ఒక్క అడుగు ముందుకేసినా చూస్తూ ఊరుకునేది లేద‌ని.. అమెరికాలోని ప్ర‌ధాన భాగాల్ని బూడిద కుప్ప‌లా చేస్తామంటూ చెప్పిన మాట‌లు కొత్త వేడిని పుట్టేలా చేశాయి. ఏ రోజున.. ఏ టైంకి తామేం చేస్తామ‌న్న విష‌యాన్ని చెప్ప‌మ‌ని.. అణుప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌టం ఖాయ‌మ‌ని.. తాము ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌మ‌ని.. అస‌లు ఆ అవ‌స‌రం లేద‌ని ఉత్త‌ర కొరియా బ్రాండ్ అంబాసిడ‌ర్ తేల్చి చెప్ప‌టం గ‌మ‌నార్హం.
త‌మ‌పై అమెరికా అణుదాడి చేయ‌ద‌ని.. ఆ విష‌యం త‌మ‌కు తెలుస‌న్న కిమ్ ప్ర‌తినిధి.. మొద‌ట దాడి చేసేది త‌మ అధ్య‌క్షుడేనంటూ చేసిన వ్యాఖ్య‌లు ఇరు దేశాల మ‌ధ్య యుద్ధ మేఘాల్ని క‌మ్ముకునేలా చేయ‌ట‌మే కాదు.. ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. దక్షిణ కొరియా అధ్య‌క్షుడిగా తాజాగా ఎన్నికైన మూన్‌.. అమెరికా.. ఉత్త‌ర కొరియాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల్ని తొల‌గించే బాధ్య‌త‌ను తాను తీసుకున్న‌ట్లుగా చెప్పిన త‌ర్వాత‌.. ఈ స్థాయిలో ఉత్త‌ర కొరియా వ్యాఖ్య‌లు చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. రోజురోజుకీ.. అంత‌కంత‌కూ దిగ‌జారుతున్న ఈ రెండు దేశాల సంబంధాలపై అంత‌ర్జాతీయంగా ప‌లువురు ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.