Begin typing your search above and press return to search.

శ‌రీరం నిండా పురుగుల‌తో బోర్డర్ దాటేసిన సైనికుడు

By:  Tupaki Desk   |   18 Nov 2017 9:33 AM GMT
శ‌రీరం నిండా పురుగుల‌తో బోర్డర్ దాటేసిన సైనికుడు
X
ఇటీవ‌లి కాలంలో త‌రుచుగా వార్త‌ల్లో నిలుస్తున్న ఉత్త‌ర‌కొరియా మ‌రోమారు అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే ఈ ద‌ఫా దేశాధినేత కిమ్ కార‌ణంగా కాదు...ఆ దేశానికి చెందిన ఓ సైనికుడి కార‌ణంగా. ఆయ‌న ఆరోగ్య స్థితిగ‌తుల వ‌ల్ల‌. ఉత్తరకొరియా పొరుగున ఉన్న‌ దక్షిణ కొరియాలోకి చొరబడేందుకు ఓ సైనికుడు ప్ర‌య‌త్నిస్తున్న క్ర‌మంలో ఆయ‌న‌పై ఉత్త‌ర‌కొరియా సైన్యం కాల్పులు జ‌ర‌ప‌డం...స‌ద‌రు సైనికుడికి ద‌క్షిణా కొరియా ఆశ్ర‌యం ఇచ్చి వైద్య స‌హాయం చేయ‌డం తెలిసిన సంగ‌తే.

అయితే ఆయ‌న‌కు వైద్య స‌హాయం చేస్తున్న స‌మ‌యంలో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆయ‌నకు చికిత్స చేస్తున్న వైద్యులు షాక్‌ కు గుర‌య్యార‌ట‌. ఆయ‌న‌పై జ‌రిగిన కాల్పుల‌ను చూసి కాదు...అత‌ని శ‌రీరంలోని పురుగుల‌ను చూసి. అవును స‌ద‌రు సైనికుడి శ‌రీరంలోని ప్ర‌తిభాగంలో వేల సంఖ్య‌లో పురుగులు ఉండ‌టాన్ని వైద్యులు గ‌మ‌నించారు. ఆ సైనికుడి చిన్న పేగులో కొన్ని వందల కొద్ది గుండ్రని పురుగులు ఉన్న‌ట్లు గుర్తించారు. శ‌స్త్రచికిత్స చేసిన వైద్యుడు అత‌డి శ‌రీరంలో నుంచి 27 సెంటీమీట‌ర్ల పురుగును వెలికితీసి అవాక్క‌య్యార‌ట‌. ఈ విష‌యాన్ని మీడియాతో పంచుకుంటూ..త‌న 20 ఏళ్ల వైద్య వృత్తిలో ఇంత‌టి దారుణ‌మైన రోగికి శ‌స్త్రచికిత్స చేయ‌లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలిపారు.

కాగా, ఇలాంటి ఆరోగ్య స్థితికి ఉత్త‌ర‌కొరియాలోని వ్య‌వ‌సాయ‌ - వైద్య ప‌రిస్థితులు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మాన‌వ మ‌లాన్ని నైట్ సాయిల్ పేరుతో ఆ దేశంలో పంట‌ల‌కు ఎరువుగా ఉప‌యోగిస్తుంటారు. అలా పండించిన కూర‌గాయ‌ల‌ను వాడ‌టం వ‌ల్ల ఇలా శ‌రీరంలో పురుగులు త‌యార‌య్యాయ‌ని అంటున్నారు. ఈ పురుగుల్లో కొన్ని ప్రాణాంక‌త‌మైన‌వ‌ని, మ‌రికొన్ని సాధార‌ణ‌మైన‌వ‌ని చెప్తున్నారు. కాగా , ఆధునిక వైద్య ప‌ద్ద‌తుల‌ను అవ‌లంభించ‌క‌పోవ‌డం, నిపుణులైన వైద్యులు లేక‌పోవ‌డం వ‌ల్ల ఇంకా ఉత్త‌ర‌కొరియాలో ఆరోగ్య స్థితిగతుల్లో మార్పు రాలేదు. 2006-14మధ్య కాలంలో ఉత్త‌ర‌కొరియాను సంద‌ర్శించిన ద‌క్షిణా కొరియా బృందం క్రానిక్ హెపటైటిస్ బి,పారాసైట్స్ ఇన్ఫెక్షన్స్ క్రానిక్ హెపటైటిస్ సి వంటి వ్యాధుల‌తో ఉత్త‌ర‌కొరియ‌న్లు బాధ‌ప‌డుతుండ‌టాన్ని గుర్తించింది.