Begin typing your search above and press return to search.

బిర్యాని ప్యాకెట్లలో ముక్కు పుడకలు ..ఎందుకంటే?

By:  Tupaki Desk   |   10 March 2021 7:30 AM GMT
బిర్యాని ప్యాకెట్లలో ముక్కు పుడకలు ..ఎందుకంటే?
X
రాజకీయం .. ఈ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎన్నికల్లో పోటీచేసిన వ్యక్తి గెలవడానికి ఏదైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. తాజాగా ఎన్నికల్లో ఏంచేసైనా గెలవాలనే లక్ష్యంతో సరికొత్త ఎత్తుగడ వేసి పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు. నంద్యాల 12 వార్డులో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయగా అందులో బంగారం ముక్కు పుడకలు ఉన్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. పొట్లాలు పంపిణీ చేస్తున్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి రూ.55వేల డబ్బులు, 23 బంగారు ముక్కు పుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు కర్ణాటకకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే ... నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఖండే శ్యాంసుందర్‌ లాల్‌ బరిలో ఉన్నాడు. ఓటర్లను డబ్బు, బంగారంతో మభ్యపెట్టాలని ప్రయత్నించి ,అసలు ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిచి, వారితో మంగళవారం బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు.కానీ సీన్ రివర్స్ కావడంతో పోలీసులకు చిక్కారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియామావళి అతిక్రమణ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ సారి ఎన్నికలను అధికార , ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వేళ ఎన్నికల్లో డబ్బు పంచుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఓటర్ల ప్రలోభాల పర్వం కొనసాగుతుంది .