Begin typing your search above and press return to search.

ఇంటింటికీ కాదు.. ఆ మంత్రి ఇంట్లోనే పింఛ‌న్లు!

By:  Tupaki Desk   |   3 Aug 2022 11:11 AM GMT
ఇంటింటికీ కాదు.. ఆ మంత్రి ఇంట్లోనే పింఛ‌న్లు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ప్ర‌భుత్వ సేవ‌ల‌ను ప్ర‌తి ఇంటికీ డోర్ డెలివ‌రీ చేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొద‌టి నుంచీ చెబుతూ వ‌స్తోంది. ఇందుకోస‌మే వ‌లంటీర్ల‌ను, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నుంచి ఆ పార్టీ నేత‌ల వ‌ర‌కు చెబుతున్నారు. చివ‌ర‌కు రేష‌న్ ను ఇళ్ల వ‌ద్ద‌కే వాహ‌నాల ద్వారా అందిస్తోంది.

అయితే ప్ర‌తి ఇంటికీ వెళ్లి అందించాల్సిన పింఛ‌న్ల‌ను ఒక మంత్రి త‌న ఇంటికి పిలిపించుకుని ల‌బ్ధిదారుల‌కు అందించ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. వివ‌రాల్లోకెళ్తే కర్నూలు జిల్లా ఆలూరు మండలానికి కొత్త‌గా ఆగ‌స్టు నెల నుంచి 312 పింఛన్లు మంజూరయ్యాయి. వీటిని ఆలూరు నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వాటిని పంపిణీ చేశారు.

కొత్త‌గా పింఛను మంజూరైన వృద్ధులు, వితంతువులు 20 మందిని అధికారులు, వ‌లంటీర్లు మంత్రి ఇంటికి తోడ్కొని పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో మంత్రి తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌ధానంగా పింఛ‌న్లు అంద‌జేయ‌డం కోస‌మే వ‌లంటీర్లు ఉన్నారు. ఇందుకోసం వారికి ప్ర‌భుత్వం జీతాలు కూడా ఇస్తోంది. అలాంటి మంత్రి జయరాం త‌న ఇంటికి వృద్ధుల‌ను, వితంత‌వుల‌ను పిలిపించి పింఛ‌న్లు ఇవ్వ‌డం ఏమిట‌ని.. ఇదేనా ప్ర‌భుత్వం చెబుతున్న డోర్ డెలివ‌రీ అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

కాగా క‌ర్నూలు జిల్లా ఆలూరు మండలం కురుకుందలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి జ‌య‌రాం కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఓ గంటపాటు గ్రామంలో ఎంపిక చేసిన ప్రాంతంలోనే పర్యటించార‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు.

సమస్యలు వివరించేందుకు వచ్చేవారిని పోలీసులు వారించార‌ని ప్ర‌ధాన మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ప్ర‌జ‌లు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.